‘బాహుబలి-3’.. అదిరిపోయే అప్ డేట్ ఇచ్చిన జక్కన్న..!

భారతదేశ చలన చిత్ర చరిత్రనే తిరగరాసి, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన బాహుబలి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా బాహుబలి.. టాలీవుడ్ సినిమా రేంజ్ ని ఓ స్థాయికి తీసుకెళ్లింది. ఒక విధంగా చెప్పాలంటే.. తెలుగు సినిమాలు బాహుబలికి ముందు.. బాహుబలికి తర్వాత అన్నట్లుగా మారిపోయాయి.

బాహుబలి సినిమాను దర్శకధీరుడు రాజమౌళి రెండు భాగాలుగా తెరకెక్కించారు. రికార్డు స్థాయిలో బాహుబలి సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాత్రికేయులు బాహుబలి-3పై ప్రశ్నలు అడిగారు. బాహుబలి-3 సినిమా రానుందని భావించవచ్చా? అని ప్రశ్నించారు. 

ఈ ప్రశ్నలకు రాజమౌళి పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యారు. బాహుబలి-3 వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ‘బాహుబలి’ చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలు బాహుబలి-3లో చూపించనున్నామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వర్క్ చేస్తున్నామని, తమ నిర్మాత శోభు యార్లగడ్డ కూడా సుముఖంగా ఉన్నారని రాజమౌళి తెలిపారు. అయితే దీనికి కాస్త సమయం పట్టొచ్చని, కానీ బాహుబలి రాజ్యం నుంచి ఆసక్తికరమైన వార్త రానుందని వివరించారు. ప్రస్తుతం తన దృష్టి అంతా ‘ఆర్ఆర్ఆర్’ పైనే ఉందన్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ సినిమాపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతానని రాజమౌళి స్పష్టం చేశారు. దీంతో బాహుబలి-3 కచ్చితంగా ఉంటుందని సినీ అభిమానులు భావిస్తున్నారు.  

 

 

Leave a Comment