ఇక ఆటో మ్యూటేషన్..!

ప్రస్తుతం భూములు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లు నమోదు చేసుకునేందుకు మీసేవ కేంద్రాలకు.. వెళ్లి నిర్ధిష్ట రుసుము చెల్లించి..పత్రాలన్నీ స్కాన్ చేసి సమర్పించి.. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇంకా అక్కడి సిబ్బందికి ఎంతో కొంత సమర్పిచుకోవాల్సి వస్తోంది.  ఇక నుంచి భుముల కొనుగోలు దారులకు ఈ కష్టాలన్నీ తీరినట్లే..ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం భూ యజమాన్య హక్కుల మార్పిడి (మ్యూటేషన్) విషయంలో మరో ముందడుగు వేసింది. అవినీతి రహితంగా, పారదర్శకంగా, సులభతరంగా, సత్వర సేవలు అందించేందుకు ప్రభుత్వం ఆటో మ్యూటేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆటో మ్యూటేషన్ సేవల పోస్టర్ ను మంగళవారం సచివాలయంలో విడుదల చేశారు. 

ఎటువంటి ఫీజులు ఉండవు…

ఇక నుంచి భములు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఆన్ లైన్ లోనూ, రెవెన్యూ రికార్డుల్లోనూ వారి పేర్ల నమోదు కోసం ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. దరఖాస్తు కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే మీ భూమి ఆర్ఓఆర్, 1బి, అడంగల్ లో తాత్కాలిక ప్రాతిపదికన అధికారులు నమోదు చేస్తారు. తరువాత ఆ లావాదేవీలపై అభ్యంతరాల స్వీకరణకు రెవెన్యూ అధికారులు 15 రోజులు గడువు ఇస్తారు. తర్వాత తహసీల్దార్ కార్యాలయ అదికారులు చట్టబద్ధమైన ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ ప్రక్రియలో ప్రతి దశలో పట్టాదారు మొబైల్ కు మెసేజ్ వస్తుంది. రిజిస్ట్రేషన్ జరిగిన 30 రోజుల్లో తహసీల్దార్ ధ్రువీకరించి రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేస్తారు. తర్వాత ఎలక్ట్రానిక్ పట్టాదారు పాస్ పుస్తకాన్ని www.meebhoomi.ap.gov.in నుంచి ప్రజలు నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Leave a Comment