టీడీపీ నేతల వాహనాలపై దాడి

మాచర్ల : టీడీపీ నాయకులపై వైసీపీ దాడులు కొనసాగుతున్నాయి. స్థానిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న తదితరులు బుధవారం మాచర్ల ప్రాంతంలో పర్యటించారు. టీడీపీ నాయకులు పర్యటిస్తున్న విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తులు కార్యకర్తలు ద్విచక్రవాహనాలపై వెంబడించి కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. డ్రైవర్‌ అప్రమత్తతో వ్యవహరించి కారును వేగంగా ముందుకు తీసుకెళ్లడంతో బుద్దా వెంకన్న దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. న్యాయవాది కిశోర్‌ తలకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బుద్దా వెంకన్న, బొండా ఉమ వాహనాలపై దాడి

బాధితుడు కిశోర్‌, బొండా ఉమా, బుద్ద వెంకన్నతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ కార్యాలయం నుంచి ఫోన్‌లో మాట్లాడి ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. ‘‘టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ అనుమతించకపోవడంతో న్యాయపరమైన సమస్య పరిష్కారానికి వెళ్లా. ఒక్కసారిగా వచ్చి మా కారుపై దాడి చేశారు. తలకు గాయాలయ్యాయి. మాపై దాడి చేయడంతో డ్రైవర్‌ వెంటనే అప్రమత్తమై కారును వేగంగా పక్కకు మళ్లించడంతో ప్రాణాలతో బయటపడ్డాం’’ అని కిశోర్‌ తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ మాట్లాడుతూ.. నిన్న నామినేషన్‌ ప్రక్రియను అడ్డుకున్నారని తామంతా వెళ్లామని, తను, బుద్దా వెంకన్న వెళ్తున్న కారుపై ఒక్కసారిగా దాడి చేశారి చెప్పారు. న్యాయవాది కిశోర్‌ తలపై కర్రలతో దాడికి పాల్పడ్డారన్నారు. వారి నుంచి తప్పించుకుని మర్కాపురం వైపు వెళ్తుంటే మళ్లీ అడ్డుకున్నారన్నారు. పోలీసులు ఉన్నా తమపై దాడి చేశారన్నారు. గన్ మెన్‌ తుపాకీ చూపిస్తే అతనిపై కూడా దాడి చేశారన్నారు. దీంతో గన్మెన్‌ పరారయ్యాడన్నారు. పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చినా సురక్షితంగా తీసుకెళ్తారనే నమ్మకం లేదన్నారు. తమకు రక్షణగా వచ్చిన డీఎస్పీ వాహనంపైనా దాడి చేశారని అని ఉమా వివరించారు.

బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. ఇది దుర్మార్గమైన చర్య అన్నారు.  ప్రాణాలతో తిరిగొస్తామనే నమ్మకం లేదన్నారు. ప్రస్తుతం దుర్గి చేరుకున్నామన్నారు. అడుగడుగునా అడ్డుకుంటున్నారన్నారు. తాము ఎటు వైపు వెళ్తున్నామో వెంటనే వారికి సమాచారం వెళ్తోందని, ప్రస్తుతానికి పోలీసు వాహనంలోనే ఉన్నామని, ఈ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారని వివరించారు.

 

Leave a Comment