ఏపీలో మరో కీలక కార్యక్రమం.. నేటి నుంచి ఇంటి వద్దకే వైద్యం..!

రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజలకు ఇంటి వద్దనే చికిత్స అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమం దేశంలోనే తొలిసారిగా ఏపీలో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 28 నుంచి సుమారు 20 వేల మంది ఏఎన్ఎంలు 1.48 కోట్ల కుటుంబాల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తారు. సుమారు 5.34 కోట్ల మంది ప్రజల వివరాలను నమోదు చేయనున్నారు. ఇక ప్రమాదకరంగా పరిగణించే ఏడు కరాల జబ్బులను గుర్తించి వైద్య సదుపాయం అందిస్తారు. ఈ డేటాను ప్రత్యక యాప్ ద్వారా నమోదు చేస్తారు. 

గుర్తించే జబ్బులు..

ప్రధానంగా ఏడు రకాల జబ్బులు మధుమేహం, హైపర్ టెన్షన్, లెప్రసీ(కుష్టువ్యాధి) లక్షణాలు, క్షయ ప్రాథమిక లక్షణాలు, నోరు, సర్వైకల్ రొమ్ము క్యాన్సర్లు లాంటివి, చిన్నారులు, మహిళల్లో రక్తహీనత, చిన్నారుల్లో వినికిడి లోపం, ఇతరత్రా పుట్టుకతో వచ్చే జబ్బులను ఏఎన్ఎంలు గుర్తిస్తారు. ఎవరికీ చికిత్స అవసరమో సూచిస్తారు. పెద్ద జబ్బులైతే నేరుగా ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు పంపిస్తారు. ఈ హెల్త్ డేటాను ఆరోగ్యశ్రీ కార్డుల్లో నిక్షిప్తం చేస్తారు. స్క్రీనింగ్ పరీక్షల కోసం ప్రజలను నాలుగు కేటగిరీలలో విభజించారు.

గేటగిరీలు..

  • ఆరేళ్ల లోపు చిన్నారులు
  • 6-20 ఏళ్లలోపు వారు
  • 20-60 ఏళ్లలోపు వారు
  • 60 ఏళ్లు దాటిన వారు

ఈ కార్యక్రమాన్ని ఒక నెలలో పూర్తి చేసేవిధంగా ప్రణాళిక రూపొందించారు. ఒక్కో ఏఎన్ఎంకు 500 నుంచి 800 వరకు ఇల్లు కేటాయించారు. రోజుకు 25 నుంచి 30 ఇళ్లలో స్క్రీనింగ్ చేపట్టి నెల రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.  

Leave a Comment