ఏ మహిళా చేయని పని.. కాటికాపరిగా ఓ మహిళ..!

అసలు చాలా ప్రాంతాల్లో మహిళలు స్మశానానికే వెళ్లరు. అలాంటిది ఏ మహిళా చేపట్టని వృత్తిని ఆమె ఎంచుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అనారోగ్యంతో మరణించడంతో బతుకుబండిని లాగేందు కాటికాపరిగా మారింది. కళ్ల ముందే కళేబరాలు కనిపిస్తున్నా ఏ మాత్రం బెదరకుండా కుటుంబ పోషణ కోసం ఎవరూ చేయని సాహసాన్ని చేస్తోంది. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రచలానికి చెందిన ముత్యాల అరుణకు రాజమండ్రికి చెందిన శ్రీనుతో చిన్నవయస్సులో ప్రేమ వివాహం జరిగింది. శ్రీను భద్రాచలం కరకట్ట పక్కనే ఉన్న స్మశానంలో కాటికాపరి వద్ద పనిచేసేవాడు. అనంతరం తానే కాటికాపర అయ్యాడు. పెళ్లయిన కొన్నేళ్లకు శ్రీను అనారోగ్యంతో మరణించాడు. 

అప్పటికే అరుణ తండ్రి అనారోగ్యంతో మంచం పట్టాడు. ఇటు భర్త మరణం, అటు తండ్రి అనారోగ్యం.. ఇంట్లో చూస్తే చిన్నపిల్లలు.. కుటుంబ భారం మొత్తం ఆమెపై పడింది. దీంతో భర్త చేసే వృత్తినే ఎంచుకుంది. కుటుంబ సభ్యులకు ఆమె ఆధారంగా నిలిచింది. తనకు, తన వారికి కడుపు నింపుతున్న ఈ పని పట్ల తనకు గౌరవమని, తాను ఇష్టపడి ఈ పనిని ఎంచుకున్నానని అరుణ చెబుతోంది.   

Leave a Comment