బుడ్డోడి సాహసం.. కాటేసిన పామును చంపి ఆస్పత్రికి తీసుకెళ్లాడు..!

పామును చూస్తే ఎవరైనా భయపడతారు.. కాని ఈ బుడ్డోడు మాత్రం పాము కాటేసినా భయపడలేదు. ఆ పామును వెంటాడి మరీ చంపేశాడు. పైగా ఆ పామును పట్టుకుని ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. 

కాంచీపురం ఏకనాంపేట్టకు చెందిన ఏడేళ్ల బాలుడు దర్షిత్ మూడో తరగతి చదువుతున్నాడు. ఈనెల 16న వెల్ వైకోట్టయి గ్రామంలోని తన అవ్వ వద్దకు వెళ్లాడు. అక్కడ పొలంలో ఆడుకుంటుండగా బాలుడుకు ఏదో కరిచింది. వెంటనే ఆ బాలుడు ఏం కరిచిందా అని వెతికాడు. అక్కడ రక్తపింజరి జాతి విషనాగు పాకుతూ వెళ్తుండగా చూశాడు. 

అంతే ఆ పామును వెంటాడి రాళ్లతో కొట్టి చంపేశాడు. చచ్చిన పామును చేతపట్టుకుని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో కలిసి కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. పాము కాటేసినా బాలుడిలో ఎలాంటి మార్పు రాలేదు. రెండు రోజులు ఆస్పత్రిలో ఉంచి పంపించేశారు.

అయితే ఆ తర్వాత బాలుడి కాలు వాచిపోయి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నై ఎగ్మూరులోని ప్రభుత్వ పిల్లల ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలుడు పూర్తిగా కోలుకోవడంతో బాలుడిని డిశ్చార్జ్ చేశారు. ఆస్పత్రికి పామును ఎందుకు తీసుకొచ్చావు అని వైద్యులు ప్రశ్నించారు. దానికి తనను ఏ జాతి పాము కాటేసిందో తెలిస్తేనే కదా మీరు తగిన చికిత్స చేసేది అంటూ సమాధానం ఇచ్చాడు.  

Leave a Comment