సైకిల్ పై రూ.1.51 లక్షల రోడ్డు ట్యాక్స్.. షాక్ అయిన యజమాని..!

సాధారణంగా బైక్స్ లేదా కార్లపై రోడ్ ట్యాక్స్ పడుతుంది. అయితే ఒక సైకిల్ పై రోడ్ ట్యాక్స్ నోటీస్ పంపించారు అధికారులు.. సైకిల్ పై భారీ మొత్తంలో రోడ్డు ట్యాక్స్ పడటంతో దాని యజమాని షాక్ అయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఔరయ్యా నగరంలోని దిబియాపూర్ లో చోటుచేసుకుంది.

దిబియాపూర్ సమీపంలోని సెహుద్ గ్రామానికి చెందిన సురేష్ చంద్రకు ఓ సైకిల్ ఉంది. అయితే ఆయనకు 2014 జూన్ నుంచి 2021 సెప్టెంబర్ వరకు మోటార్ వాహనాల పన్నుగా రూ.1,51,140 చెల్లించాలని నోటీసులు వచ్చాయి. అసిస్టెంట్ రీజనల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ నుంచి సెప్టెంబర్ 16న జారీ చేసిన ఈ నోటీస్ మూడు రోజుల క్రితం అందాయి. 

ఈ నోటీస్ సురేష్ చంద్ర 16 ఏళ్ల కొడుకు సుధీర్ పేరిట జారీ అయింది. అయితే సుధీర్ కి అసలు సైకిలే లేదు. ఈ నోటీసులో వాహనం ఫిట్ నెస్ లకు సంబంధించిన నోట్ కూడా ఉంది. ఈ నోటీసులు చూసిన యజమాని షాక్ అయ్యాడు. తనకు ఎలాంటి వాహనం లేదని, తనకు కేవలం ఒక సైకిల్ మాత్రమే ఉందని పేర్కొన్నాడు. ఈ విషయం ఆర్టీఓ అధికారి అశోక్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆ నోటీస్ పొరపాటున జారీ అయి ఉంటుందని చెప్పారు. ఇలా తప్పుడు నోటీసులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామాని తెలిపారు.    

 

Leave a Comment