సామాన్యులపై మరో భారం.. ఆటో ఎక్కాలంటే జీఎస్టీ కట్టాల్సిందే..!

కొత్త సంవత్సరంలో సామాన్యులపై మరో భారం పడనుంది. ఓలా, ఉబర్ వంటి యాప్ ల ద్వారా ఆటోలు బుక్ చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం 5 శాతం జీఎస్టీ విధించనుంది. 2022 జనవరి 1 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. దీంతో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులపై మరింత భారం పడనుంది. ఆటో లేదా ర్యాపిడో బైక్ బుక్ చేసుకునే సమయంలో 5 శాతం పన్ను కలిపి రైడ్ ధర నిర్ణయిస్తారు. అయితే ఆఫ్ లైన్ విధానంలో ఆటోలు ఎక్కితే జీఎస్టీ వర్తించదు..

యాప్ ఆధారిత సేవలతో ఇంటి నుంచే ఆటో రైడ్స్ బుక్ చేసుకునే అవకాశం ఉండటంతో చాలా మంది ఆ సేవలను ఉపయోగించుకుంటున్నారు. పైగా రెగ్యులర్ క్యాబ్స్ తో పోలిస్తే ఆటో రైడ్స్ కి అయ్యే ఛార్జీ తక్కువ. కానీ కేంద్రం విధించబోతున్న జీఎస్టీ కారణంగా ప్రజలు యాప్ ఆధారిత ఆటో సేవల వైపు అంతగా మొగ్గు చూపకపోవచ్చు. యాప్స్ లేదా ఏ ఆన్ లైన్ నెట్ వర్క్ తో సంబంధం లేకుండా రోడ్లపై తిరిగే ఆటోల వైపే ప్రజలు ఎక్కువగా మొగ్గుచూపే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆటో డ్రైవర్స్ సంఘం వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరుతోంది.  

      

Leave a Comment