హీరో విశాల్ గొప్ప మనసు.. పునీత్ చదివిస్తున్నా 1800 మందిని నేను చదివిస్తా..!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతితో సినీ ప్రపంచం శోకసంద్రంలో ముగినిపోయింది. పునీత్ గొప్ప హీరో మాత్రమే కాదు.. ఎన్నో సేవ కార్యక్రమాలను నిర్వహించి ప్రజల మనస్సులో స్థానం సంపాదించుకున్నాడు. పునీత్ 1800 మందికి పైగా విద్యార్థులకు చదివిస్తున్నాడు. 45 ఫ్రీ స్కూల్స్, 26 అనాధాశ్రమాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు కట్టించారు. చనిపోయాక కూడా ఆయన రెండు కళ్లను దానం చేశారు.. 

అయితే పునీత్ హఠాత్మరణం తర్వాత ఆయన చదివిస్తున్న 1800 మంది పిల్లల బాధ్యతను ఎవరు తీసుకుంటారనేది ప్రశ్నార్థకమైంది. ఈక్రమంలో తమిళ హీరో విశాల్ గొప్ప మనసు చాటుకున్నారు. పునీత్ చదివించిన 1800 పిల్లల బాధ్యతను ఇక నుంచి తాను చూసుకుంటానని చెప్పారు. ఒక స్నేహితుడిగా పునీత్ సేవ కార్యక్రమాలకు తన వంతు సాయం అందిస్తానని మాటిస్తున్నానని విశాల్ ప్రకటించారు. 

విశాల్ నటించిన ‘ఎనిమి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా పునీత్ కు నివాళులర్పించారు విశాల్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పునీత్ లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని, ఆయన మరణం చిత్ర పరిశ్రమకే కాదు.. సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ ఈవెంట్ సందర్భంగా పిల్లల బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు ప్రకటించారు. విశాల్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. విశాల్ కూడా సినిమాలతో పాటు రైతులకు, పేద ప్రజలకు సాయం చేస్తూ వారిని ఆదుకుంటున్నాడు..      

Leave a Comment