నిరుపేద కోటీశ్వరులు.. అమ్మేవి చాయ్, సమోసా.. కోట్లల్లో ఆస్తులు..!

సాధారణంగా బడా వ్యాపారుల్లో కోటీశ్వరులు ఉండటం సహజం.. కానీ రోడ్డు పక్కన చాయ్, సమోసా అమ్ముకునే వారు కోట్లు సంపాదించారంటే నమ్మరేమో.. చిన్న వ్యాపారాలు చేసే వీళ్లు కోట్లు ఎలా సంపాదిస్తారని అనుకుంటారు.. అలా అనుకుంటే పొరపాటే.. ఈ నమ్మలేని నిజాలు కాన్పూర్ లోని జీఎస్టీ, ఆదాయ శాఖ అధికారుల పరిశీలనలో వెలుగులోకి వచ్చాయి. 

అక్కడ రహదారిపై చాయ్-సమోసా, చాట్, క్రిస్పీ-కచోరి, పాన్ షాపుల వాళ్ల వద్ద కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయట.. ఈ ఫుట్ పాత్ వ్యాపారులంతా ఆహార భద్రతకు భరోసా ఇచ్చే ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికెట్ తీసుకోకుండానే వ్యాపారాలు చేస్తున్నారు. వీరిపై ఆదాయపు పన్ను శాఖ నిఘా పెట్టింది. 

ఆదాయపు పన్ను శాఖ, జీఎస్టీ రిజిస్ట్రేషన్ దర్యాప్తులో 256 మంది వ్యాపారులు కోటీశ్వరులుగా బయటపడ్డారు. డేటా సాఫ్ట్ వేర్, ఇతర సాంకేతిక పరికరాల సహాయంతో వారి వివరాలను పరిశీలించగా, అసలు విషయం బయటపడింది. వీరిలో చాలా మంది ఖరీదైన కార్లు, ఎకరాల్లో భూములు లాంటివి కొనుగోలు చేస్తూ ఆస్తులు భారీగానే కూడబెడుతున్నారని తెలిసింది. వీరు ఇప్పటివరకు ఒక్క పైసా పన్ను కూడా చెల్లించకుండా వ్యాపారలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

కాగా, హిందూస్థాన్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. ఈ వ్యాపారులు జీఎస్టీ రిజిస్ట్రేషన్ వెలుపల ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించలేదట. కానీ నాలుగు సంవత్సరాలలో 375 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని కొనుగోలు చేశారని వెల్లడించింది. ఆర్యనగర్, స్వరూప్ నగర్, బిర్హానా రోడ్, హులగంజ్, పిరోడ్, గుమ్తి వంటి చాలా ఖరీదైన వాణిజ్య ప్రాంతాల్లో పలు ఆస్తులను కొనుగోలు చేశారని, దక్షిణ కాన్పూర్ లో కూడా ఆస్తులు కొన్నారని తెలిపింది. ప్రస్తుతం అధికారులు ఈ విషయాలపై పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. 

Leave a Comment