అనాధ శవాన్ని 3 కి.మీ. మోసుకెళ్లిన పోలీసులు.. డీజీపీ సవాంగ్ ప్రశంసలు..!

పోలీసులు మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఇటీవల ఓ అనాధ శవాన్ని తన భుజాలపై మోసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు కాశీబుగ్గ మహిళా ఎస్సై శిరీష.. తాజాగా కుళ్లిపోయి దుర్వాసన వస్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని మూడు కిలోమీటర్ల దూరం మోసి విశాఖ జిల్లా రాంబిల్లి పోలీసులు మానవత్వం చాటుకున్నారు. 

సీతపాలెం తీరానికి శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది. దీంతో ఎస్సై అరుణ్ కిరణ్ కేసు నమోదు చేసి తెలిసిన వాళ్లుంటే తీసుకెళ్లాలని, చుట్టుపక్కల గ్రామాలకు, పలు పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. అయితే శనివారం వరకు ఎవరూ రాలేదు. మరోవైపు మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. 

మృతదేహం తరలింపునకు స్థానికులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఎస్సై వి.అరుణ్ కిరణ్ స్పందించారు. ఏఎస్సై దొర, హెడ్ కానిస్టేబుల్ మసేను, కానిస్టేబుల్ నర్సింగరావు, హోంగార్డు కొండబాబుతో కలిసి ఎస్సై అరుణ్ కిరణ్ మృతదేహాన్ని 3 కిలోమీటర్లు మోసుకెళ్లి సీతపాలేనికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి వాహనంలో మార్చురీకి తరలించారు.

డీజీపీ సవాంగ్ ప్రశంసలు..

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ రాంబిల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ, సిబ్బంది విధి నిర్వహణలో మానవత్వం చూపించినందుకు ప్రశంసించారు. అనాథ శవాన్ని మోసుకెళ్లి మానవత్వం చాటుకున్న పోలీసులను ప్రజలు అభినందిస్తున్నారు. 

 

Leave a Comment