చదువు రాదని భర్త వేధించడంతో మహిళ ఆత్మహత్య..!

తల్లిదండ్రులను కూడా కాదనుకుని ఐదేళ్ల క్రితం ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మహారాణిలా చూసుకుంటానని చెప్పడంతో తల వంచి తాళి కట్టించుకుంది. జీవితంపై ఎన్నో కలలు కంది. అయితే ఆ కలలు ఎంతో కాలం నిలవలేదు. చదువులేని మొద్దును పెళ్లి చేసుకున్నానని భర్త ఈసడించుకోవడంతో కలత చెందింది. ముగ్గురు పిల్లలను చేసి తన మనసుకు సర్ది చెప్పుకుంటూ వచ్చింది. భర్తకు తోడు అత్త, మామ, బావల వేధింపులు ఎక్కువ కావడంతో ఇక భరించలేక బలవన్మరణానికి పాల్పడింది. 

కర్నూలు జిల్లా కౌతాళం మండలం పెద్దతుంబళం గ్రామానికి చెందిన సుజాత(22) ఎల్ఎల్సీలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల మేరకు పెద్ద తుంబళం గ్రామానికి చెందిన సుంకప్ప అదే గ్రామానికి చెందిన సుజాత ఐదేళ్ల క్రితం ప్రేమించి, పెద్దలను ఎదురించి పెద్దతుంబళం పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేసుకున్నారు. 

సుంకప్ప గన్మెన్ గా తుంగభద్ర రైల్వే స్టేషన్ లో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి సైనా(4), యువాంతక(2), ఈరన్న(9నెలలు) పిల్లలున్నారు. కాగా పెళ్లయిన రెండేళ్లకు భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. చదువుకోలేదని నిత్యం భర్త వేధించేవాడు. భర్తతో పాటు అత్త, మావ, బావలు సూటిపోటి మాటలతో వేధించేవారు. 

ఈక్రమంలో వారం క్రితం పుట్టినింటికి వెళ్లగా తల్లి సర్దిచెప్పి పంపింది. సోమవారం సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చిన భర్త..మరోసారి గొడవపడ్డాడు. దీంతో మనస్తాపానికి గురై పిల్లలను వదిలి ఇంట్లో నుంచి రాత్రి 7 గంటల సమయంలో బయటకు వెళ్లింది. ఈ విషయమై సుంకప్ప వెంటనే అత్తకు ఫోన్ లో చెప్పడంతో ఇరు కుటుంబాల సభ్యులు కలసి గాలించారు. 

ఆచూకీ లభించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా ఉదయం ఎమ్మిగనూరు అగ్నిమాపక కేంద్రం సమీపంలో ఎల్ఎల్సీలో మృతదేహం బయటపడింది. బట్టలు ఉతికేందుకు వెళ్లిన వారు గమనించి పోలీసులకు సమచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే తన కూతురిని భర్త, అత్త, మామ వారి కుటుంబ సభ్యులే హత్య చేసి కాలువలో పడేశారని మృతురాలి తల్లి ఆరోపిస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  

Leave a Comment