ఈ అవకాశాన్ని దేవుడిచ్చాడు : సీఎం జగన్

వైఎస్సార్ రైతు భరోసా రెండో విడత పెట్టుబడి సాయాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో 50.47 లక్షల రైతుల ఖాతాల్లో రూ.1,115 కోట్లు జమ చేశారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఖరీఫ్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీ ఖరీఫ్‌లోనే చెల్లించారు. ఆ మేరకు 1.66 లక్షల రైతుల ఖాతాల్లో రూ.135.73 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ (పెట్టుబడి సాయం) జమ చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని దేవుడిచ్చాడన్నారు. ‘వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్’ రెండో విడత సాయం కింద 50 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. పెట్టుబడి సాయం కింద రూ.13,500 అందిస్తున్నామన్నారు. మే నెలలో రూ.7,500, అక్టోబరులో రూ.4 వేలు చెల్లిస్తున్నామన్నారు. మళ్లీ సంక్రాంతి సందర్భంగా జనవరిలోనే రూ.2 వేలు ఇస్తామని జగన్ స్పష్టం చేశారు. 

గిరిజన రైతులకు రూ.11,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. లక్ష మంది గిరిజన రైతులకు రూ.104 కోట్ల సాయం చేస్తున్నామన్నారు. ఈ ఏడాది ఈ సీజన్ లో వర్షాలు, వరదల వల్ల జూన్ నుంచి సెప్టెంబరు వరకు నష్టపోయిన దాదాపు 1.66 లక్షల రైతులకు ఇన్ పుట్ సబ్సిబీ ఇస్తున్నామన్నారు. అక్టోబర్ నెల నష్టానికి సంబంధించి లెక్కలు సేకరిస్తున్నామని, అవి పూర్తయిన వెంటనే నవంబర్ లో వాటిని చెల్లిస్తామని జగన్ తెలిపారు. 

Leave a Comment