చంద్రబాబును జైలుకు పంపే వరకు పోరాడుతా : లక్ష్మీపార్వతి

టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపేవరకు తాను పోరాడుతూనే ఉంటానని తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతీ స్పష్టం చేశారు. చంద్రబాబు అక్రమ ఆస్తులపై లక్ష్మిపార్వతీ వేసిన పిటిషన్ శుక్రవారం హైదరాబాద్ లోని ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు అక్రమ ఆస్తుల కేసు విషయంలో ఆమె మాట్లాడుతూ న్యాయవ్యవస్థను ప్రక్షాళన చేయాలని కోరారు. ఏసీబీ కోర్టులో న్యాయం జరగకపోతే హైకోర్టుకు వెళ్తానని, అక్కడ న్యాయం జరక్కపోతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని ఆమె వెల్లడించారు. 

గతంలో కేసు విత్ డ్రా చేసుకోమని చంద్రబాబు తనకు ఫోన్ చేసి ఒత్తిడి చేశారని చెప్పారు. 2004 ఎన్నికల అఫడివిట్ లో చంద్రబాబు చూపిన ఆస్తులపై లక్ష్మీపార్వతి ఏసీబీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.. చంద్రబాబుకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని, ఆయన ఆస్తులపై విచారణ జరిపించాలని లక్ష్మీపార్వతి పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు విచారణను ఏసీబీ కోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది. 

Leave a Comment