చెవుల్లో కూడా కరోనా..!

ప్రపంచంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా విషయంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ముక్కు, నోరు, కండ్ల నుంచి కరోనా ప్రవేశిస్తుందని తెలుసు. కానీ తాజాగా చెవుల ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుందని హెడ్ అండ్ నెక్ సర్జరీ డిపార్ట్ మెంట్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. చెవి వెనుక ఉన్న పుర్రె, చెవిలోని మాస్టాయిడ్ ఎముకకు కూడా ఈ వైరస్ సోకుతుందని అధ్యయనంలో తేల్చింది. 

జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు ముగ్గురిపై పరిశోధనలు చేస్తే ఇద్దరికి మధ్య చెవుల్లోనే కాకుండా వెనక చెవిలో కూడా వైరస్ ఎక్కువ ఉందని గుర్తించారు. కరోనాతో చికిత్స పొందుతున్న రోగుల మరణానికి ముందు వారి నమూనాలను సేకరించి ఈ పరీశోధనలు నిర్వహించారు. అయితే కరోనా తీవ్రత పెరిగినప్పుడు రోగి శరీరం నుంచి వైరస్ చెవుల్లోకి వెళ్తుందా లేక చెవుల నుంచి శరీరంలోకి ప్రవేశిస్తుందా అన్న సందేహాలు కలుగుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. 

మరికొంత మందిని పరిశీలిస్తే కానీ ఈ విషయంపై స్పష్టత రాదని వారు తెలుపుతున్నారు. అయితే కరోనా వైరస్ చెవి ఇన్ఫెక్షన్లు లేదా చెవి సమస్యలతో ముడిపడి ఉందని వెల్లడి కావడం ఇదే మొదటిసారి కాదు. ఏప్రిల్ లో జరిగిన ఒక అధ్యయనంలో కరోనా రోగుల్లో చెవిపోటు, వినికిడి లోపం లాంటి లక్షణాలు కనుగొన్నారు. ఇంతకు ముందు వినికిడి సమస్య లేకపోయినా కరోనా వచ్చాక కొంత వినికిడి సామర్థ్యం తగ్గినట్లు కనుగొన్నారు.  

Leave a Comment