బ్యాంక్ లాకర్ లో 84 ఏళ్ల వృద్ధుడు.. 18 గంటల పాటు..!

బ్యాంక్ సిబ్బంది నిర్వాకం వల్ల ఓ వృద్ధుడు 18 గంటల పాటు బ్యాంక్ లాకర్ గదిలో ఉండాల్సి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంక్ లో జరిగింది.  వివరాల మేరకు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.67లో కృష్ణారెడ్డి అనే 84 ఏళ్ల వృద్ధుడు నివాసం ఉంటున్నాడు. 

కృష్ణారెడ్డి సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో లాకర్ పని నిమిత్తం జూబ్లీహిల్స్ చెక్ పోస్టులోని యూనియన్ బ్యాంక్ కి వెళ్లారు. లాకర్ గదిలో కృష్ణారెడ్డి తన పనిలో నిమగ్నమయ్యాడు. అయితే బ్యాంక్ సిబ్బంది కూడా కృష్ణారెడ్డి లాకర్ లోపలే ఉన్న విషయాన్ని గమనించకుండా లాకర్ గదిని మూసివేశారు. 

దీంతో కృష్ణారెడ్డి సోమవారం రాత్రంతా లాకర్ లోనే గడపాల్సి వచ్చింది. కృష్ణారెడ్డి ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం ఉదయం పోలీసులు బ్యాంక్ వద్దకు వెళ్లారు. 

అనుమానం వచ్చి అక్కడి సీసీ పుటేజీలను పరిశీలించారు. కృష్ణారెడ్డి లాకర్ గదిలోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే లాకర్ ఓపెన్ చేయించి కృష్ణారెడ్డిని బయటకు తీసుకొచ్చారు. ఆయనకు షుగర్ సమస్య ఉండటంతో వైద్య పరీక్షల నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. 

 

 

Leave a Comment