భారత్ లో 39 మందికి కరోనా..!

భారత్ లో కరోనా వైరస్ పంజా విసురుతోంది. కరోనా కేసులు 39కి పెరిగాయి. దేశంలోనే తొలిసారిగా కరోనా కేసు నమోదైన కేరళలో మరోసారి కరోనా కలవరం రేపుతోంది. ఆదివారం ఒక్క రోజే కేరళలో కొత్తగా ఐదు కరోనా పాటిజివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. దీంతో భారత్ లో నిన్నటి వరకు 34 వరకు ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నేటికి 39 కి చేరింది. 

కేరళలో నమోదైన కరోనా కేసుల్లో ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం వారిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

కేేరళకు చెందిన బాధితుల్లో ముగ్గురు ఇటీవలే ఇటలీకి వెళ్లి తిరిగి వచ్చారు. వీరితో పాటు కాంటాక్టులో ఉన్న మరో ఇద్దరు కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. అయితే ఇటలీ నుంచి తిరిగి వచ్చినా తర్వాత ఎయిర్ పోర్టులోని హెల్ప్ డెస్క్ కు కానీ, సమీపంలోని ఆస్పత్రికి గానీ బాధితులు రిపోర్టు చేయలేదని కేరళ ప్రభుత్వం తెలుపుతోంది. జ్వరం, జలుబు లక్షణాలు బయటపడటంతో వారిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

కరోనా కొత్త కేసులతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. వారితో కాంటాక్టులో ఉన్న వారిని గుర్తించడంపై దృష్టి పెట్టింది. ఆ ఐదుగిరితో పాటు విమానంలో ప్రయాణించిన వారు కూడా తక్షణమే రిపోర్టు చేయాలని సూచించింది.

మరో వైపు ఉత్తర ప్రదేవ్ లో 6, ఢిల్లీలో 3, కేరళలో 3, జమ్మూ కాశ్మీర్ లో 3, తెలంగాణ, తమిళనాడులో ఒక్కొక్కరితో పాటు 16 మంది ఇటలీ పర్యాటకులకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు 39 కరోనా కేసులు నమోదయ్యాయి. 

Leave a Comment