‘లవ్ జిహాద్’ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. యోగికి 104 ఐఎఎస్ అధికారల లేఖ..!

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘లవ్ జిహాద్’(Love Jihad) ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా 104 మంది మాజీ ఐఎఎస్ అధికారులు సీఎం యోగి ఆదిత్యనాథ్ కు లేఖ రాశారు. లవ్ జిహాద్ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రం ద్వేషం, విభజన, మతోన్మాద రాజకీయాలకు కేంద్రంగా మారిందని వారు లేఖలో పేర్కొన్నారు. 

చట్ట విరుద్ధమైన ఈ ఆర్డినెన్స్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరూ తమ జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కని అలహాబాద్ హైకోర్డుతో సహా పలు కోర్టులు తీర్పునిచ్చాయని తెలిపారు. యూపీ రాజ్యాంగం ఆ తీర్పును నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తారు.

సీఎం యోగీతో సహా ఇతర రాజకీయ నాయకులందరూ తాము పాటిస్తామని ప్రమాణం చేసిన రాజ్యాంగాన్ని మరోసారి తిరిగి చదవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఒకప్పుడు గంగా జమునా నాగరికతకు కేంద్రంగా బాసిల్లిన యూపీ ఇప్పుడు ద్వేషం, విభజన, మూర్ఖత్వ రాజకీయాలకు కేంద్రంగా మారిందన్నారు. పాలనా సంస్థలు ఇప్పుడు మతపరమైన విషంలో మునిగిపోయాయని వారు లేఖలో పేర్కొన్నారు. 

యూపీలోని మైనారిటీ వర్గాలకు చెందని యువకులపై యూపీ ప్రభుత్వం జరిపిన దాడులతో భారత రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛను హరించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల ప్రారంభంలో యూపీలోని మొరదాబాద్ లో జరిగిన కేసుతో సహా మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్న పలు సందర్భాలను ఎత్తి చూపారు. ఈ దాడులతో పోలీసులు మౌనం వహించడాన్ని సిగ్గు చేటుగా పేర్కొన్నారు. 

ఈ దురాగతాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని, ఈ లవ్ జిహాద్ వ్యతిరేక చట్టం ద్వారా భారతీయ స్త్రీల ఎంపిక స్వేచ్ఛను హరించడమేకాక, ముస్లిం యువకులను బాధితులుగా చేసేలా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. లేఖలో సంతకం చేసిన వారిలో మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమరావ్, ప్రధాన మంత్రి మాజీ సలహాదారు టికెఎ. నాయర్ తదితరులు ఉన్నారు. 

 

 

Leave a Comment