‘వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించి.. ఆ ఇద్దరికీ సారధ్య బాధ్యతలు ఇవ్వండి’

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ విభేదాలు ఉన్నట్లు చాలాకాలం నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలకు బలం చేకూరుస్తూ ఓ విషయం తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. టీ20 ప్రపంచకప్ తర్వాత నుంచి టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న విరాట్ కోహ్లీ.. వన్డేలు, టీ20ల నుంచి రోహిత్ శర్మను వైస్ కెప్టెన్‌గా తప్పించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీకి సలహా ఇచ్చినట్లు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ సంచలన కథనాన్ని ప్రచురించింది.

ప్రస్తుతం రోహిత్ శర్మ వయస్సు 34 ఏళ్లని అతని పక్కనపెట్టాలని విరాట్ కోహ్లీ బోర్డును కోరాడట. యువకులైన కెఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లకు వన్డే, టీ20 సారధ్య బాధ్యతలను అప్పగించాలని కోరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మను వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించమనడంతో.. విరాట్ కోహ్లీ నిజమైన సక్సెసర్‌ను కోరుకోవడం లేదని బోర్డు వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సలహాతో కోహ్లీ వన్డే కెప్టెన్సీ కూడా డేంజర్‌లో పడిందని చెబుతున్నారు.

కాగా, ప్రస్తుతం పరిమిత ఓవర్ల జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మకు టీ20 ప్రపంచకప్ అనంతరం టీ ట్వెంటీలకు జట్టు పగ్గాలను అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి. అలాగే యూఏఈ వేదికగా అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను గెలవకపోతే.. కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించి వన్డేలు, టీ20లకు రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.!

Leave a Comment