రాజధాని మార్పుపై పునరాలోచించాలి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి 

కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ అమరావతి రైతుల విజ్ఞప్తి 

ఢిల్లీ : రాజధానిని మార్చినంత మాత్రాన అధికార వికేంద్రీకరణ జరగదని, రాష్ట్ర ప్రభుత్వం రాజధాని విషయంలో పునరాలోచన చేయాలని  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులు, అమరావతి పరిరక్షణ సమితి నేతలు శివారెడ్డి, స్వామి తదితరులు  ఢిల్లీలో కిషన్‌రెడ్డిని కలిశారు.తమ పిల్లల్ని ఒప్పించి, తరతరాలుగా వస్తున్న భూములను ప్రభుత్వానికి ఇచ్చామని కిషన్‌రెడ్డికి వారు వివరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, భాజపా జాతీయాధ్యక్షుడు నడ్డాలతో మాట్లాడి ఏపీ ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. రాష్ట్ర పరిధిలోని అంశమైనప్పటికీ వేలాది ఎకరాలు, వందలాది మంది రైతులకు సంబంధించినది కాబట్టి రైతుల మనోభావాలనూ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని, ముఖ్యమంత్రి జగన్‌ పునరాలోచన చేయాలని సూచించారు. మండలి రద్దుకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం కేంద్రానికి రాలేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌ శివారెడ్డి మాట్లాడుతూ కేంద్రం జోక్యం చేసుకోకపోతే దేశంలో మరెక్కడా ప్రభుత్వానికి రైతులు సెంటు భూమి కూడా ఇవ్వరని తెలిపారు. ప్రధాని మారినప్పుడల్లా రాజధానిని ఢిల్లీ నుంచి మార్చుతామంటే పరిస్థితేంటని ప్రశ్నించారు. తుళ్లూరు మండలానికి చెందిన స్నేహలతారెడ్డి మాట్లాడుతూ ఉదయమంతా ధర్నాలో కూర్చొని సాయంత్రం ఇంటికొచ్చాక తెల్లారేసరికి ఏం జరుగుతుందోనన్న భయం, ఆందోళనతోనే 27 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత రైతు మార్టిన్‌ మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాలవారు భూములిస్తే కేవలం ఒక్క సామాజికవర్గానికే ఉద్యమాన్ని ఆపాదించడం సబబు కాదని స్పష్టం చేశారు. దళితులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమితి కోఆర్డినేటర్‌ స్వామి మాట్లాడుతూ సోమవారం పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసి అమరావతిలో పరిస్థితులను వివరిస్తామని చెప్పారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోడీల అపాయింట్‌మెంట్లు అడిగామని వెల్లడించారు.

Leave a Comment