రైతుకు ప్రతినెలా జీతం ఇవ్వాలి : బీజెపీ 

ప్రజల ఆకలి తీర్చేందుకు రైతన్న ఆరు కాలం కష్టపడి పంటను పండిస్తున్నాడని, వారికి కూడా నెలవారీ జీతం ఇవ్వాలని బిజెపి రాష్ట్ర రైతు నాయకులు వైవి సుబ్బారావు డిమాండ్ చేశారు. రైతు కోసం సేవ చేసే కంపెనీలు, వ్యాపారులు, ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగులు అందరూ రైతు పండించే పంట మీదే ఆధారపడ్డాయన్నారు. వారందరూ కూడా లక్షల్లో కోట్లలో సంపాదిస్తున్నారన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతుకు ఆకలి చావులు మాత్రం తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వీరికి ప్రతి నెల 20 వేల నుంచి 50 వేల రూపాయలు జీతం ఇచ్చే విధంగా కొత్త చట్టాన్ని  తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేశారు.  

అలాగే రైతు మీద ఆధారపడి వ్యాపారాలు చేస్తున్న పురుగు మందుల కంపెనీలు, విత్తన కంపెనీలు, పలు రకాల కంపెనీల దగ్గర నుండి రైతు సంక్షేమ నిధి కొరకు వీరు పొందే లాభాలలో 25 శాతం వసూలు చేయాలనీ ప్రభుత్వాన్ని కోరారు. అలా ఏర్పడిన ఈ నిధి నుండి రైతుకు ప్రతి నెలా జీతం ఇవ్వాలని కోరారు. రైతు సేవలో ఉన్నటువంటి అధికారులు, వ్యాపారాలు అందరూ కూడా ఆర్ధికంగా బలపడుతున్నారని, కాని రైతు కుటుంబం మాత్రం ఆకలి చావులతో ఆత్మహత్యలకు దారి తీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుకు యూనియన్లు సంఘాలు లేవు కాబట్టి రైతు ఈ స్థితిలో ఉండాల్సి వచ్చిందన్నారు. 

Leave a Comment