కరోనాపైప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. 

సిమ్స్‌లో కరోనా పరీక్ష కేంద్రం ఏర్పాటు

వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి

అమరావతి : రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా మరింత అప్రమత్తత చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నెల్లూరులో ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైందని వెల్లడించారు. బాధితుడు ఉన్న ప్రాంతం చుట్టుపక్కల కిలోమీటరు వరకు ప్రతి ఇంటిని సర్వే చేశామని చెప్పారు. కరోనా బాధితుడి కుటుంబ సభ్యులు, పని మనిషికి కూడా వైద్య పరీక్షలు చేయడంతో పాటు.. వైద్యుల పర్యవేక్షణలో కూడా ఉంచామని పేర్కొన్నారు. ఏపీలో ప్రస్తుతం మరెక్కడా కరోనా వైరస్‌ కేసులు నమోదు కాలేదన్నారు. 13 జిల్లాల్లో 56 ప్రభుత్వాసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో మరో 300 బెడ్లను సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఇటలీ నుంచి ఏపీకి 238 మంది ప్రయాణికులు వచ్చారని.. వారిని గుర్తించి ప్రత్యేక వైద్య పరీక్షలు జరుపుతున్నామని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. సిమ్స్‌లో కరోనా పరీక్షా  కేంద్రాన్ని ఏర్పాటు చేశామని జవహర్‌రెడ్డి పేర్కొన్నారు.

 

Leave a Comment