జనం కోసమే జనతా కర్ఫ్యూ..

ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరించందన్

ప్రధాని పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూను పాటించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి అంతకంతకూ వ్యాప్తి చెందుతుండడంతో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరికి వారు తమ దాగా రాదులే అన్న భావనలో ఉండవద్దని గవర్నర్ హితవు పలికారు. బయట ఎంత ఎక్కువగా తిరిగితే అంతగా నష్టం వాటిల్లుతుందని,  మనతో పాటు కుటుంబీకులు, ఇరుగు పొరుగువారు కూడా వైరస్‌ బారిన పడతారని గవర్నర్ హెచ్చరించారు. తాజా పరిస్ధితిని ఎదుర్కునేందుకు సంయుక్తంగా పోరాడాలని ఆదివారం ‘‘జనతా కర్ఫ్యూ’’ పాటించాలన్న ప్రధాన మంత్రి సూచనను అందరం పాటిద్దామని సూచించారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని, బయటకు అడుగుపెట్టరాదని కోరారు. జనతా కర్ఫ్యూ మన స్వయం నియంత్రణకు ఓ సంకేతం వంటిది కాగా,  ప్రతి ఒక్కరూ కనీసం 10 మందికి ఈ సందేశాన్ని చేరవేసి ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. 

కృతనిశ్చయం, సంయమనం ప్రాతిపదికన వైరస్ కు చరమగీతం పాడాలన్న ప్రధాని పిలుపు ఎంతో విలువైనదన్న బిశ్వ భూషణ్,  ప్రతీ చోటా సామాజిక దూరం అత్యావశ్యకమన్నారు. కరోనా అతి వేగంగా విస్తరిస్తున్నట్లు వివిధ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని ఇప్పటి వరకు కరోనాకు మందు లేనందున కొన్ని వారాల పాటు బయట తిరగకుండా ఇంటి నుండే పని చేసేందుకు ప్రయత్నించాలన్నారు.  ఈ తరహా జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనా వ్యాప్తి గొలుసును అధికమించగలుగుతామన్నారు. 

జనతా కర్ఫ్యూ అవశ్యకత గురించి స్వచ్ఛంధ సంస్ధలతో పాటు రెడ్ క్రాస్, ఎన్ సిసి, స్కౌట్స్, గైడ్స్, ఎన్ ఎస్ ఎస్ వంటి వ్యవస్ధలు ప్రజలకు వివరించాలన్నారు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు వైద్య ఆరోగ్య సిబ్బంది ఎంతో కష్టపడుతున్నారని వారిని ప్రోత్సహించేలా సమాజం వ్యవహరించాలని గవర్నర్ అన్నారు. మానవాళి మనుగడ కోసం చేపడుతున్న ఈ మహోన్నత కార్యక్రమాన్ని ప్రతి పౌరుడు తనదిగా భావించాలని అప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని బిశ్వ భూషణ్ పేర్కొన్నారు. 

 

Leave a Comment