స్థానిక ఎన్నికల్లో జనసేన-బీజేపీ కలిసే పోటీ

ఢిల్లీ: ఏపీలో త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో కలిసి వెళ్లాలని జనసేన-బీజేపీ నిర్ణయించాయి. ఈమేరకు ఆ పార్టీ నేతలు దిల్లీలో సమావేశమై చర్చించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు‌, ఏపీ భాజపా ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దియోదర్‌, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో పాటు ముఖ్యనేతలంతా చర్చలు జరిపారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు.

స్థానిక ఎన్నికల్లో ఇరు పార్టీలు ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించినట్లు జీవీఎల్‌ తెలిపారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు పురందేశ్వరి, సోము వీర్రాజు తదితరులు బిజీగా ఉన్నారని.. వారితో  టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి సమాలోచనలు జరిపామన్నారు. మార్చి 8న మరో దఫా విజయవాడలో సమావేశమై ఏయే స్థానాల్లో ఎవరెవరు పోటీచేయాలనేదానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అనంతరం నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ 12న ఇరుపార్టీలు స్థానికంగానే మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. ఈ సందర్భంగా లాంగ్‌మార్చ్‌ గురించి పవన్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. దిల్లీ ఎన్నికలు, ఇతర కారణాలతో వాయిదా వేశామని చెప్పారు.

 

Leave a Comment