ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం

స్టేట్ క్రెడిట్ సెమినార్ లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గురువారం నాబార్డ్‌ నిర్వహించిన స్టేట్‌ క్రెడిట్‌ సెమినార్‌లో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ 2020-21 నాటికి స్టేట్ ఫోకస్ పేపర్ ను విడుదల చేశారు. 2020-21లో రూ.1,34,402.52 కోట్లు వ్యవసాయ రుణులుగా,మొత్తంగా ప్రాథమిక రంగానికి రూ.2,11,865.38 కోట్ల రుణాలుగా ఫోకస్ పేపర్ లో నాబార్డ్ పేర్కొంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్టాడుతూ రాష్ట్రంలో 62 శాతం మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు అపారమైన అవకాశాలున్నాయన్నారు. 

ఆక్వా, ఫిషరీస్ రంగాల్లో ఫస్ట్…

ఆక్వా, ఫిషరీస్‌ లాంటి వ్యవసాయ అనుబంధ రంగాల్లో నంబర్‌ వన్‌గా ఉన్నామని జగన్ తెలిపారు. 

దేశం మొత్తం ఇప్పుడు మాంద్యాన్ని ఎదుర్కొంటోందన్నారు. దీని ప్రభావం మొదటగా ప్రాథమిక రంగాలపైనే పడుతుందన్నారు. మెజార్టీ సంఖ్యలో ప్రజలకు ఉపాధి కల్పించే ఈ రంగంపైనే దృష్టిపెట్టాలని తెలిపారు. 

46 లక్షల మంది రైతులను ఆదుకున్నాం..

తాము చేపట్టిన పథకాలు గతంలో ఎక్కడా అమలు చేయలేదని, రైతు  భరోసా కింద 46 లక్షలమంది రైతులను ఆదుకున్నామని చెప్పారు. 69శాతం మంది రైతులకు ఒక హెక్టార్‌ కన్నా తక్కువ భూమే ఉందన్నారు. సగం హెక్టార్‌ కన్నా ఉన్న రైతులు 50 శాతం మంది ఉన్నారన్నారు. వీరికి ఏటా రూ.13500 రైతు భరోసా కింద అందిస్తున్నామన్నారు. 80శాతం వ్యవసాయపెట్టుబడులు సమకూరుస్తున్నామన్నారు. 

వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం..

రైతులు కట్టాల్సిన బీమా ప్రీమియంను ప్రభుత్వమే కడుతుందని, రైతులపై భారం లేకుండా చేశామని అన్నారు. రూ. 3వేల కోట్లు ధరల స్థిరీకరణ నిధి కోసం పెట్టామన్నారు. అన్ని పంటలకూ కనీస మద్దతు ధరలు ప్రకటించామన్నారు. 

యాజమాన్య పద్ధతులపై తోడుగా…

ప్రతి 2వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయాన్ని పెట్టామని, వీటికి పక్కనే సుమారు 11వేలకుపైగా రైతు భరోసా కేంద్రాలను పెడుతున్నాని అన్నారు. అగ్రికల్చర్‌ అసిస్టెంట్, హార్టికల్చర్‌ అసిస్టెంట్, ఫిషరీస్‌ అసిస్టెంట్, ఆక్వా అసిస్టెంట్లను ఈ గ్రామ సచివాలయాల్లో పెట్టామన్నారు. వీరు రైతులకు యాజమాన్య పద్ధతులపై తోడుగా ఉంటారన్నారు.  రైతు భరోసా కేంద్రాల్లో కియోస్క్‌ ఉంటుందన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులను అమ్ముతారన్నారు. వివిధ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, మండలాల వారీగా హబ్‌లను ఈ కంపెనీలు ఏర్పాటు చేస్తాయని చెప్పారు. . ఆర్డర్‌ ఇచ్చిన 24–48 గంటల్లోగా రైతులకు కావాల్సినవి అందుతాయన్నారు. ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకునేందుకు విపత్తు నిధిని కూడా పెట్టామని, దీనికి నాబార్డు సహకారం కావాలని కోరారు. 

ఫుడ్ ప్రొసెసింగ్ జోన్స్ కు యత్నం…

రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఫుడ్ ప్రొసెసింగ్ జోన్స్ పెట్టే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టామని జగన్ తెలిపారు. తర్వాత నియోజకవర్గాల స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేసున్నామన్నారు. రైతులకు కిసాన్‌ క్రెడిట్‌కార్డులు అందాలన్నారు. .ఈ కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను రైతు భరోసా కేంద్రాలకు లింక్‌ చేసేలా చూడాలన్నారు. 

పోలవరం రాష్ట్రానికి జీవనాడి..

పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యతతో కూడిందని, రాష్ట్రానికి జీవనాడి లాంటిదని జగన్ అన్నారు. కృష్ణాలో నీళ్లు రావడంలేదని, మరోవైపు గోదావరి నీళ్లు సముద్రంలోకి పోతున్నాయని చెప్పారు. తాము రూ. 5వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తే.. దానిపై వడ్డీ సుమారుగా రూ.500 కోట్లకుపైగా కడుతున్నామన్నారు.  సుమారు రూ.1800 కోట్లకుపైగా డబ్బులు కూడా నాబార్డు నుంచి పీపీఏకి వెళ్లాయని, అవి ఇంకా రాలేదని అన్నారు. ఈ సమస్యలను తీర్చేలా.. పూర్తిస్థాయి సహకారం కావాలని కోరారు. ఆర్ అండ్ ఆర్ కింద ఏడాదికి కనీసం రూ.10వేల కోట్లు, సివిల్ పనుల కోసం ఈ ఏడాది రూ.6వేల కోట్లు కావాలన్నారు. 

వినూత్న మార్పులు కోరుతున్నారు.. మంత్రి కన్నబాబు

వ్యవసాయరంగంలో వినూత్న మార్పులను ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించే దిశగా చర్యలు తీసుకుంటున్నారన్నారు.

సులభంగా  రుణాలు ఇవ్వొచ్చు..అజేయ కల్లాం

కిసాన్‌క్రెడిట్‌ కార్డుల జారీ ద్వారా ఈ వ్యవస్థను వాడుకుని రైతులకు సులభంగా రుణాలు ఇవ్వొచ్చని ప్రధాన సలహదారుడు అజయ కల్లాం అన్నారు. అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారిని కూడా ఆదుకోవాలన్నారు. 

పూర్తి సహకరాలు అందిస్తాం ..నాబార్డ్‌  చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సెల్వరాజ్‌

రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, నవరత్నాల కార్యక్రమాలను చేపడుతోందని అన్నారు. రైతు భరోసా, వడ్డీలేని రుణాలు ఇతరత్రా కార్యక్రమాలను రైతులకోసం చేపడుతోందని సెల్వరాజ్ తెలిపారు. ఇవన్నీ కూడా రైతుల ఆదాయాలను రెట్టింపు చేసే కార్యక్రమాలన్నారు. ధరలస్థిరీకరణ నిధిని, ప్రకృతి వైపరీత్యాల నిధిని పెట్టి రాష్ట్రం మార్గదర్శకంగా నిలిచిందన్నారు. ప్రాథమిక రంగానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సెల్వరాజ్  హామీ ఇచ్చారు. 

Leave a Comment