ప్రతి ఒక్కరూ కరోనాపై యుద్ధం చేయాలి: కిషన్‌ రెడ్డి

ప్రజలు రోడ్లపై పెద్ద ఎత్తున గూమిగూడడం, పోలీసులతో వాదించడం సరికాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి లాక్‌డౌన్‌ ప్రకటించాయని, ప్రజలు సహకరించాలని కోరారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ప్రతి వ్యక్తి ఆదర్శంగా ఉండేలా వ్యవహరించాలని కోరుతున్నామని తెలిపారు. కరోనా వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తిచెందే వ్యాధని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. కరోనా నుంచి కోలుకున్న 37 మందిని డిశ్చార్చి చేశామని అన్నారు. ‘ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ప్రకటిస్తారు. ప్రస్తుతం మన శరీరంతో మనమే యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంది. కరోనా సోకకుండా ప్రతి వ్యక్తి యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది’ అని వ్యాఖ్యానించారు.’ఇటలీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం. అక్కడి ప్రజలను కరోనా పట్టిపీడిస్తోంది. మన దేశంలోకి ఆలస్యంగా కరోనా ప్రవేశించింది. దీంతో ఇప్పటివరకు తక్కువ నష్టం జరిగింది. విదేశాల నుంచి వచ్చి సొంత ఇళ్లలో ఉన్నవారిని ప్రతి రోజూ పర్యవేక్షిస్తున్నాం’ అని కిషన్ రెడ్డి తెలిపారు.

 

Leave a Comment