ఆన్ లైన్ లో ఫేక్ ఆయోధ్య ప్రసాదాలు.. అమెజాన్ కి నోటీసులు 

అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. వందల ఏళ్ల కల నెరవేరేందుకు కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. ఈక్రమంలో ఆధ్యాత్మికం పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు మోసగాళ్లు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఏకంగా అయోధ్య రాముడి పేరుతో నకిలీ ప్రసాదం అమ్మకాలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో అమెజాన్ సంస్థకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. అయోధ్య ప్రసాదం పేరుతో కస్టమర్లను మోసం చేస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నోటీసులు జారీ చేసింది.

ఈ ఘటనపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ -సీఏఐటీ.. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ – సీసీపీఏకి ఫిర్యాదు చేసింది. దీంతో అమెజాన్‌ సంస్థకు కేంద్రం నోటీసులు ఇచ్చింది.  శ్రీ రామ మందిర్‌ అయోధ్య ప్రసాద్‌ పేరుతో అమెజాన్ విక్రయాలు చేస్తున్నట్లు తెలిసింది. రఘుపతి నెయ్యి లడ్డూ, అయోధ్య రామ మందిర్‌ అయోధ్య ప్రసాద్‌, ఖోయా ఖోబీ లడ్డూ, రామ మందిర్‌ అయోధ్య ప్రసాదం-దేశీ దూద్‌ పేడ.. ఇతర ఉత్పత్తులను అమెజాన్‌లో అమ్ముతున్నట్లు తెలుస్తోంది.  

అయితే సాధారణ స్వీట్‌లనే అయోధ్య రామ మందిర ప్రసాదంగా ఆన్‌లైన్‌లో అమ్ముతున్నట్లు గుర్తించారు. మోసపూరిత వాణిజ్య పద్ధతుల్లో అమెజాన్‌ నిమగ్నమై ఉందని తెలిపారు. తప్పుడు ప్రకటనలతో వినియోగదారుల్ని మోసం చేస్తున్నారని సీఏఐటీ అమెజాన్‌పై చేసిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ నోటీసుల నేపథ్యంలో అమెజాన్‌ సంస్థ వారంలోపు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సరైన వివరణ ఇవ్వలేని నేపథ్యంలో వినియోగదారుల రక్షణ చట్టం-2019 ప్రకారం చర్యలు తప్పవని అమెజాన్‌ను సీసీపీఏ హెచ్చరించింది. మరోవైపు ఈ నోటీసులపై అమెజాన్‌ సంస్థ స్పందించింది. ఈ విషయంలో సెల్లర్ల జాబితాను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ నోటీసులపై తమ పాలసీ ప్రకారం ముందుకు వెళ్తామని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

మరోవైపు.. ఆన్‌లైన్‌లో అయోధ్య రామమందిర ప్రసాదం విక్రయిస్తామంటూ కొందరు ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఇలాంటి వాటిపై ఇప్పటికే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్.. స్పందించింది. ప్రస్తుతానికి తాము ఏ ఆన్‌లైన్‌ వేదికల్లోనూ ప్రసాదాన్ని విక్రయించట్లేదని ట్రస్ట్ స్పష్టం చేసింది. కేవలం ఆలయ ప్రాంగణంలో మాత్రమే ప్రసాదాన్ని అందిస్తున్నామని తెలిపింది. 

Leave a Comment