దేశంలోనే బలమైన పార్టీగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదగాలని పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్రస్ధాయి వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ వర్క్‌షాపునకు జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు హాజరయ్యారు. పార్టీ నాయకులకు వైయస్ జగన్ దిశానిర్దేశం చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తగిన సమయం ఉంటుందని, మనలో ఏమైనా తప్పులుంటే వాటిని సరిదిద్దుకోవడానికి, పార్టీని మరింత పటిష్టం చేయడానికి మంచి అవకాశం ఉంటుందని తెలిపారు. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగితేనే అది మంచి ఫలితాలను ఇస్తుందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనం ఆర్గనైజ్డ్‌గా ఉంటేనే సమర్థంగా ఎదుర్కోగలమన్నారు..
మనం ఇంట్లో కూర్చుంటే.. ఏమీ జరగదని, చొరవ తీసుకుని అన్ని అంశాలపై స్పందించాలని జగన్ తెలిపారు. అన్యాయాలపై స్పందించి బాధితులకు అండగా నిలవాలన్నారు.
నాలుగు నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత:
ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూసి ఉండమని, నాలుగు నెలల్లోనే ఈప్రభుత్వం వద్దురా అని ప్రజలు చెప్పే పరిస్థితి వచ్చిందని అన్నారు. తానెప్పుడూ ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదని జగన్ అన్నారు. ఎన్నికలప్పుడు చెప్పిన సూపర్ సిక్స్‌లు ఏమయ్యాయని, ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనని.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక కనీసం బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టలేకపోతున్నారని, ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో నడుపుతున్న ప్రభుత్వం ఇది అని వైఎస్ జగన్ విమర్శించారు.
అదే మనకు, వారికి తేడా:
ఎన్నికలప్పుడు ప్రచారంలో వారిలా మనం అబద్ధాలు చెప్పలేకపోయామని, అదే మనకు వాళ్లకూ తేడా అని, ప్రతిపక్షంలో కూర్చోడానికైనా మనం వెనకాడం కానీ, అబద్ధాలు చెప్పలేమని జగన్ స్పష్టం చేశారు.. రాజకీయల్లో అధికారం ఉండొచ్చు.. ఉండకపోవచ్చు.. కానీ మళ్లీ మనల్ని అధికారంలోకి తీసుకు వచ్చేది మన విశ్వసనీయత, విలువలే. అవి లేనప్పుడు రాజకీయాలకు అర్థం లేదని చెప్పారు..
మద్యం.. ఏం మాట్లాడతాం?:
‘మద్యం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మన హయాంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో దుకాణాలు నడిపాం. ఉన్న షాపులు తగ్గించి, పర్మిట్ రూమ్స్ తీసేసి, టైమింగ్స్ పక్కాగా పెట్టి, బెల్టుషాపులు లేకుండా చూసి, అమ్మకం వాల్యూమ్స్ తగ్గించి ప్రజలకు మంచి చేశాం.
కానీ ఇప్పుడు మద్యం షాపుల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు 30 శాతం ఇస్తావా, 40 శాతం ఇస్తావా.. అని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. షాప్‌ల కోసం కిడ్నాప్‌లు కూడా చేస్తున్నారు. నిజంగా లిక్కర్ పాలసీలో దురుద్దేశాలు లేకపోతే ఎమ్మెల్యేలు ఎందుకు పోటీ పడుతున్నారు. అంత దారుణంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు. లిక్కర్ రేట్లు తగ్గిస్తామన్నారు. కానీ, రేట్లు అలాగే ఉన్నాయి. మళ్లీ పర్మిట్ రూమ్స్ తీసుకొస్తున్నారు. బెల్టుషాప్‌లు ఏర్పాటవుతున్నాయి. ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుండగా, వారికి, వాళ్ల అనుచరులకు ఆదాయం పెరుగుతోంది.’