తెలంగాణలో ఉద్యోగార్థులకు మరో సువార్త. డిసెంబర్ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతున్నట్టు సమాచారం. వచ్చే రెండు నెలల్లో దాదాపు 25 వేల పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.

పోలీస్ శాఖలో భారీ ఖాళీలు
పోలీస్ విభాగంలో మాత్రమే 17 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. కానిస్టేబుల్ నుంచి సబ్‌ఇన్స్పెక్టర్ వరకు పలు స్థాయిల్లో నియామకాలు ఉండనున్నాయి.
విద్యా శాఖలో కూడా నియామకాలు
ఇది మాత్రమే కాదు… టీచర్లు, డిప్యూటీ డీఈఓ, డైట్ కళాశాలల్లో అధ్యాపకులు, బీఈడీ కాలేజీల లెక్చరర్లు, అలాగే ఎస్‌సీఈఆర్టీ లో ఖాళీలు నింపేందుకు కూడా టీఎస్‌పీఎస్సీ (TSPSC) సన్నాహాలు చేస్తోంది.
గ్రూప్ పరీక్షలపై దృష్టి
ఇప్పటికే గ్రూప్-1లో ఎంపికైన 563 మందికి నియామక పత్రాలు సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. గ్రూప్-2 సెలెక్షన్ లిస్ట్ కూడా విడుదలైంది. అయితే ఎన్నికల నియమావళి అమలులో ఉండటంతో, పత్రాల పంపిణీ కొంత ఆలస్యమవుతోంది. ఇదే సమయంలో అక్టోబర్ లోపల గ్రూప్-3 నియామక ప్రక్రియను పూర్తి చేసి, వెంటనే కొత్త నోటిఫికేషన్లు ప్రకటించేందుకు టీఎస్‌పీఎస్సీ ప్రయత్నిస్తోంది.
ఇతర విభాగాల్లో అవకాశాలు
పోలీస్, విద్యతో పాటు ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ, విద్యుత్, విశ్వవిద్యాలయాల్లో కూడా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్లు నవంబర్ చివర్లో లేదా డిసెంబర్ మొదట్లో వచ్చే అవకాశం ఉంది.
ఇక నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం. లక్షలాది అభ్యర్థులు ఈ నియామకాల కోసం ఎదురుచూస్తున్నారు. రాబోయే రోజుల్లో నోటిఫికేషన్లు ఒక్కదాని తరువాత ఒకటి రావడంతో, అభ్యర్థులు ఇప్పటినుంచే సన్నద్ధం కావడం అవసరం.