విభిన్న ప్రతిభావంతుల విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంపై సీఎం చంద్రబాబ సమీక్ష నిర్వహించారు. దివ్యాంగులను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరముందన్న కారణంతో అధికారం చేపట్టిన తొలి నెలలోనే పింఛన్ రూ.3 వేల నుంచి ఒకేసారి రూ.6 వేలకు పెంచామన్నారు. అదే విధంగా దీర్ఘకాలిక అనారోగ్యంత బాధపడుతూ మంచానికే పరిమితమైన వారికి దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.15 వేలు ప్రతినెలా పింఛన్ రూపంలో ఇస్తున్నామన్నారు. అర్హులైన దివ్యాంగులందరికీ పింఛన్ ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు.
దీనిపై అధికారులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తప్పుడు సర్టిఫికెట్లతో దివ్యాంగుల కోటాలో పింఛన్ పొందిన ఘటనలు ఉన్నాయని, ఈ విషయంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ అంశం తన ద్రుష్టికి కూడా వచ్చిందని, అర్హులకు, బాధితులకు పింఛన్ ఇవ్వాలన్నది తమ విధానమని, దానిని దుర్వినియోగం చేసి పింఛన్లు పొందడం సరికాదని చంద్రబాబు అన్నారు.
వైద్యుల నుంచి తప్పుడు సర్టిఫికెట్లతో కొంత మంది దివ్యాంగుల పేరుతో పంఛన్లు తీసుకోవడాన్ని అరికట్టాలని ఆదేశించారు. అనర్హులు ఎవరైనా తప్పుడు పద్దతిలో పింఛన్లు పొందుతుంటే స్వచ్ఛందంగా వదులుకోవాలని సీఎం స్పష్టం చేశారు. పింఛన్ల అంశంలో ప్రత్యేకంగా గ్రామ సభలు పెట్టి అర్హులకు పింఛన్లు ఇవ్వడంతో పాటు అనర్హులను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై కార్యచరణ సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.