దీక్ష విరమించిన షర్మిల..!

తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ మూడు రోజుల దీక్ష చేపట్టిన వైఎస్ షర్మిల ఆదివారం తన దీక్ష విరమించారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం మొదట హైదరబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద అనంతరం లోటస్ పాండ్ వద్ద షర్మిల 72 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. నిరుద్యోగ, అమరవీరుల కుటుంబ సభ్యులు షర్మిలతో దీక్ష విరమింపజేశారు. 

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ నేడు తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, ఉద్యోగాల నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారని అన్నారు. పెళ్లి కూడా చేసుకోకుండా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ అసమర్థుడని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని విమర్శించారు. 

దొరలు గడీ నుంచి నియంత పాలన కొనసాగిస్తున్నారని, ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష పార్టీల నేతలు చేతులకు గాజులు వేసుకుని కేసీఆర్ ఇచ్చి డబ్బును తీసుకుంటూ డ్యాన్స్ చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందుకే తాను పోరాటం చేసేందుకు వచ్చానన్నారు. తన పోరాటం ఆగదని షర్మిల స్పష్టం చేశారు. 

 

Leave a Comment