సముద్రం లోపల పెళ్లి చేసుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు..!

ఇప్పటి యువత ఏం చేసినా కొంచెం కొత్తగా ఉండాలని భావిస్తున్నారు. అది పెళ్లి అయినా, వేరే ఫంక్షన్ అయినా కొత్తగానే ప్రయత్నిస్తున్నారు. కొంత మంది కొత్తదనం కొసం గాలిలో పెళ్లి చేసుకుంటారు. మరి కొంత మంది సముద్రంలో ఓడ మీద పెళ్లి చేసుకుంటున్నారు. కానీ తమిళనాడులో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఏకంగా సముద్రం లోపల పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్యర్యానికి గురిచేశారు. 

తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన శ్వేత, తిరువణ్ణామలైకి చెందిన చిన్నాదురై ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే తమ వివాహం వినూత్నంగా ఉండాలని భావించారు. ఏకంగా సముద్ర గర్భంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 

దీని కోసం పెళ్లికొడుకు చిన్నాదురై పుదుచ్చేరికి వెళ్లి స్కూబా డైవింగ్ శిక్షణ కళాశాల నడిపే తన స్నేహితుని వద్ద శిక్షణ పొందాడు. సోమవారం ఉదయం పెళ్లి కుమార్తె శ్వేతతో కలిసి చెన్నై సమీపంలోని నీలాంగరై సముద్రంలో ఒక పడవలో అలలపై ప్రయాణిస్తూ 60 అడుగుల దూరానికి చేరుకున్నాడు. 

వధూవరులిద్దరూ అక్కడ పెళ్లి బట్టలు వేసికుని, ఆక్సిజన్ సిలిండర్ అమర్చిన స్కూబా డైవింగ్ డ్రస్సు ను వేసుకుని సముద్రంలోకి దూకారు. సముద్రపు అడుగు భాగంలో ఉండే మొక్కల మధ్య పూలతో అలంకరించి ఉన్న వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు. అలల్లో తేలియాడుతూనే ఇద్దరూ దండలు మార్చుకున్నారు. 

ఆ తర్వాత వరుడు చెన్నాదురై వధువు శ్వేత మెడలో తాళి కట్టాడు. మాంగల్యధారణ పూర్తికాగానే వధూవరులిద్దరూ సముద్ర తీరానికి చేరుకోగా అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న బంధువులు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అయితే పెళ్లి నేరుగా చూడలేకపోయిన లోటును తీర్చేందుకు ఈనెల 13న చెన్నైలో రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు వారు చెప్పారు. 

Leave a Comment