76 ఏళ్ల తర్వాత ఇంటికి చేరిన.. ఓ సైనికుడి లేఖ..!

రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఓ అమెరికా సైనికుడు తన తల్లికి రాసిన లేఖ ఏకంగా 76 ఏళ్ల తర్వాత ఇంటికి చేరింది. ఆ లేఖను అందుకున్న ఆ సైనికుడి  కుటుంబం భావోద్వేగానికి లోనైంది. 1945 డిసెంబర్ లో అమెరికాలోని మాసాచూ సెట్స్ వోబర్న్ కు చెందిన జాన్ గోన్ సల్వేస్ జర్మనీలో విధుల్లో ఉన్నాడు. అక్కడి నుంచి తన తల్లికి జాన్ ఓ లేఖ రాశాడు.. అప్పటికీ రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది..

ఆ లేఖలో యోగక్షేమాలను అడిగిన జాన్.. త్వరలోనే నిన్ను కలుస్తానని అని రాశాడు. అయితే అతడు పంపిన లేఖ జాన్ తల్లికి చేరలేదు. 76 ఏళ్లుగా పిట్స్ బర్గ్ లోని యూఎస్ పోస్టల్ సర్వీస్ కేంద్రంలో ఉండిపోయింది. ఇన్నేళ్లుగా ఆ లేఖను పోస్టల్ సిబ్బంది తెరలేదు. ఇటీవల ఆ లేఖను జాన్ సతీమణి ఏంజెలీనా(89)కి పంపారు. చాలా ఏళ్ల కిందటే జాన్ తల్లి చనిపోయింది. జాన్ గోన్ సల్వేస్ కూడా 2015లో మరణించాడు. 

ఈ లేఖను అందుకున్న జాన్ భార్య మాత్రం భావోద్వేగానికి గురయ్యారు. 76 ఏళ్ల తర్వాత లేఖ రావడం నమ్మలేకపోయానని, కానీ ఇది జాన్ చేతిరాతే అని, ఇది ఎంతో అద్భుతంగా ఉందని ఏంజెలీనా చెప్పుకొచ్చారు. జాన్ తన వద్దకు తిరిగి వచ్చినట్లు ఉందని ఉద్వేగానికి లోనయ్యారు. ఇన్నేళ్లకు లేఖను ఇచ్చినందుకు పోస్టల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. 

Leave a Comment