ట్రాఫిక్ చలానా కట్టేందుకు మంగళసూత్రం ఇచ్చిన మహిళ..!

ట్రాఫిక్ చలానా కట్టేందుకు డబ్బులు లేకపోవడంతో ఓ మహిళ తన మంగళసూత్రాన్ని ఇచ్చింది. ఈ ఘటన కర్నాటకలోని బెళగావిలో చోటుచేసుకుంది. ఈ వార్త వైరల్ కావడంతో పోలీసుల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుక్కెరి తాలుకా హుల్లోళిహట్టి గ్రామానికి చెందిన భారతి అనే మహిళ తన భర్తతో కలసి బైక్ పై బెళగావి మార్కెట్ కు షాపింగ్ కోసం వచ్చింది. 

ఈ దంపతులు తమ వెంట తీసుకెళ్లిన డబ్బులు షాపింగ్ లో అయిపోగా కేవలం రూ.100 మాత్రమే వారి వద్ద మిగిలింది. మార్కెట్ నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో బస్టాండ్ వద్ద హెల్మెట్ లేదని పోలీసులు బైక్ ను నిలిపేశారు. డ్యాక్యుమెంట్లు ఏమీ పరిశీలించకుండా నేరుగా జరిమానా విధిస్తూ రసీదు ఇచ్చారు. 

అయితే తమ వద్ద కేవలం రూ.100 మాత్రమే ఉన్నాయని, అవి తీసుకొని వదిలేయాలని ఆ దంపతులు పోలీసులను వేడుకున్నారు. అయినా పోలీసులు కనికరించలేదు. ఫైన్ కట్టాల్సిందేనని తేల్చి చెప్పారు. పోలీసుల తీరుకు విసిగిపోయిన భారత తన మెడలో ఉన్న బంగారు తాళిబొట్టును తీసి ట్రాఫిక్ పోలీసు చేతికి ఇచ్చింది. దాన్ని అమ్మి ఫైన్ తీసుకోవాలని చెప్పింది. చివరకు అటుగా వెళ్తున్న పోలీసు ఉన్నతాధికారి జోక్యం చేసుకుని దంపతులను వదిలేశారు.  

 

Leave a Comment