ఆ అత్తకు హ్యాట్సాఫ్ అనాల్సిందే.. కొడుకు చనిపోయినా.. కోడలికి తల్లిగా మారి కన్యాదానం చేసింది..!  

సాధారణంగా అత్తా కోడలు అనగానే ఒకరంటే ఒకరికి పడదు అనుకుంటారు. చిన్న చిన్న విషయాలకు గొడవ పడుతుంటారు. కోడలిని కూతురిలా అస్సలు స్వీకరించరు. తమ ఆధిపత్యాన్ని కోడలిపై చెలాయిస్తుంటారు. కోడలిని కూతురిలా స్వీకరించే అత్తలు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఇక్కడ ఓ అత్త మాత్రం కోడలిని కూతురుగా భావించింది. కొడుకు చనిపోవడంతో కోడలిని చదివించి.. కన్న తల్లిలా మరో వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసింది. ఈ ఘటర రాజస్థాన్ లో చోటుచేసుకుంది..

రాజస్తాన్ లోని సికార్ లో నివాసం ఉండే కమలా దేవి, దిలావర్ దంపతులకు శుభమ్ అనే కొడుకు ఉండేవాడు. శుభమ్ కి 2016లో సునీత అనే అమ్మాయితో పెళ్లి జరిపించారు. సునీత పేద కుటుంబానికి చెందిన అమ్మాయి. అయితే గుణంతో పాటు అందం ఉండటంతో కట్నం తీసుకోకుండా కొడుకుకు ఇచ్చి పెళ్లి చేసింది కమలా దేవి..

పాపం ఎవరి దిష్టి తగిలిందో పెళ్లయిన ఆరు నెలలకే సునీత భర్త శుభమ్ బ్రెయిన్ డెడ్ తో మరణించాడు. అయితే బంధువులంతా సునీతను నష్టజాతకురాలని తిట్టిపోశారు.. కానీ కమలాదేవి అవేవి పట్టించుకోలేదు. కొడుకు చనిపోతే.. కోడలి తప్పేంటని వారితో వారించింది. అంతేకాదు పేద అమ్మాయి కావడంతో అమ్మగారి ఇంటికి పంపలేదు. తమ దగ్గరే ఉంచుకుని చదివించింది.

ఎంఏ బీఈడీ చదివిన సునీత ఇటీవల జూనియర్ లెక్చరర్ గా ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. సునీతను జనవరి 22న ముఖేష్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసింది. కమలాదేవి, దిలావర్ దంపతులు పెళ్లిలో కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. అప్పగింతల సమయంలో వీరి బంధం చూసిన వారు అత్తమామల బంధం అనుకోలేదు.. అమ్మానాన్నల బంధం అనుకున్నారు. ప్రస్తుతం ఈ పెళ్లి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 

   

Leave a Comment