వాట్సాప్ డీపీగా మీ ఫొటోలు పెడుతున్నారా..? అయితే ఇది మీ కోసమే..!

సైబర్ నేరగాళ్లు కొత్త పంథాను ఎంచుకున్నారు. వాట్సాప్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తున్న ఫొటోలను డౌన్ లోడ్ చేసి బ్లాక్ మెయిల్ కి దిగుతున్నారు. తాజాగా చిలకలగూడలో జరిగిన ఓ ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అసలు సోషల్ మీడియా సేఫేనా అన్న ప్రశ్నలు తలెత్తేలా చేసింది. ఇంతకు ఏం జరిగిందంటే.. 

చిలకలగూడకు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో దిగిన ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టకున్నాడు. ఈ ఫొటోను కొందరు కేటాగాళ్లు డౌన్ లోడ్ చేశారు. అనంతరం ఆ వ్యక్తి భార్య ఫొటోను మార్ఫింగ్ చేసి నగ్న ఫొటోలా తయారు చేశారు. ఈ ఫొటోను ఆమె భర్తకే పంపి బ్లాక్ మెయిల్ కి దిగారు. అడిగినంత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే ‘నీ భార్య ఫొటోను నీ కాంటాక్ట్ లిస్ట్ లో అందరికీ ఫార్వర్డ్ చేస్తాం’ అని బెదిరించారు. 

దీంతో షాక్ అయిన భర్త ఆ ఫొటోలను పంపవద్దని రెండు సార్లు రూ.1.2 లక్షలు వారికి ట్రాన్స్ ఫర్ చేశాడు. అయితే ఇంకా డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తెలిసిన వారి పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. వాట్సాప్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో మహిళలు ప్రొఫైల్ ఫొటోలు పెట్టుకోకపోవడం మంచిదని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. 

 

Leave a Comment