డెంగ్యూ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఎల్లో ఫీవర్ వంటి ప్రాణాంతక జ్వరాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇన్ని ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతున్న ఓ చిన్న దోమ మానవాళిని ముప్పుతిప్పలు పెడుతుంది. దోమకాటు వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఏటా దాదాపు 70 కోట్ల మంది ఈ వ్యాధుల బారిన పడుతున్నారు. వారిలో దాదాపు 10 లక్షల మందికి పైగా చనిపోతున్నట్లు తెలిసింది.. 

ఏడిస్ అనే జాతి దోమ కాటు వల్ల మనిషి శరీరంలోకి ప్రవేశించే వైరస్ వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది. ఈ వ్యాధి వర్షాకాలంలో అధికంగా కనిపిస్తుంది. ఈ ఏడిస్ దోమ మన ఇంటి పరిసరాల్లోనే నివసిస్తుంది. పూలకుండీలు, ఎయిర్ కూలర్లు, పాత టైర్లు, పాత ఖాళీ డబ్బాల వంటి వాటిలో చేరే నీటిలో ఈ దోమ వృద్ధి చెందుతుంది. 

డెంగ్యూ లక్షణాలు:

అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, నడుము కింది భాగంలో నొప్పి, కళ్లు మండటం, ఒళ్లు నొప్పులు, కడుపులో తిప్పడం, వాంతులు, నీరసం, చర్మంపై దద్దుర్లు వంటివి డెంగ్యూ లక్షణాలు..

డెంగ్యూ జర్వరానికి తక్షణ వైద్యం అవసరమవుతుంది. ప్లేట్ లెట్స్ సంఖ్య 50 వేల కంటే తక్కువ స్థాయికి చేరినప్పుడు ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుంది. ప్లేట్ లెట్స్ సంఖ్య క్రమంగా 50 వేలకు పెరిగే వరకు ఆస్పత్రిలోనే ఉండాలి. ప్లేట్స్ లెట్స్ 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ఉంటే సాధారణ స్థాయి అని చెప్పొచ్చు. ఇక ప్లేట్ లెట్స్ కొద్దిగా తగ్గినప్పుడు ఇంట్లోని కొన్ని ఔషధాల ద్వారా పెంచుకోవచ్చు.. కానీ ప్లేట్ లెట్స్ అధికంగా తగ్గినప్పుడు కచ్చితంగా ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది..

తిప్ప తీగ రసం:

డెంగ్యూ జర్వరానికి తిప్పతీగ మంచి ఔషధంగా చెప్పొచ్చు. తిప్పతీగ రసం జీవక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బలమైన రోగనిరోధక శక్తి డెంగ్యూ జ్వరానికి సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది. ఇది ప్లేట్ లెట్స్ ల సంఖ్యను పెంచడంలో సహాయపడుతుంది. రోగికి ఉపశమనం కలిగిస్తుంది. ఒక గ్లాసు నీటిలో తిప్పతీగ మొక్క, రెండు చిన్న కాండాలను ఉడకబెట్టి తాగాలి. 

బొప్పాయి ఆకు రసం:

డెంగ్యూ రోగుల్లో ప్లేట్ లెట్స్ సంఖ్య పెంచడానికి బొప్పాయి ఆకు రసం గొప్ప ఔషధం. బొప్పాయి ఆకు రసం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది డెంగ్యూ చికిత్సలో కూడా సహాయపడుతుంది. బొప్పాయి ఆకుల రసాన్ని రోజుకు రెండు సార్లు కొద్ది మొత్తంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. 

తాజా జామ రసం:

జామ రసం అనేక పోషకాలతో నిండి ఉంది. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. డెంగ్యూ జ్వరం కోసం మీరు తాజా జామ రసాన్ని మీ ఆహారంలో చేర్చవచ్చు. జామ రసం మీకు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. రోజుకు రెండు సార్లు జామ రసం లేదా జామ కాయను తినడం మంచిది.

Leave a Comment