పెళ్లిలో రెచ్చిపోయిన త్రిపుర కలెక్టర్ సస్పెండ్..!

త్రిపురలోని ఓ పెళ్లి వేడుకలో రెచ్చిపోయిన జిల్లా మెజిస్ట్రేట్(కలెక్టర్)పై వేటు పడింది. త్రిపుర పశ్చిమ జిల్లా మెజిస్ట్రేట్ శైలేష్ కుమార్ యాదవ్ ను సస్సెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్-19 నిబంధనలు పాటించడం లేదని పెళ్లిని నిలిపివేయించారు. వరుడితో పాటు అక్కడే ఉన్న ఆడా మగ అని చూడకుండా పలువురిపై చేయి చేసుకున్నారు. 

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈక్రమంలో త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ ఆదేశాల మేరకు ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ముందు హాజరైన కలెక్టర్ శాంతిభద్రతలు అమలు చేయడం, కరోనా వ్యాప్తిని నివారించడం తన బాధ్యత అని తెలిపారు. ఆ రోజు రాత్రి తాను చేసినదానికి కట్టుబడి ఉన్నానని కమిటీ ముందు చెప్పారు. 

ఎమ్మెల్యేలు ఆషిష్ సాహా, సుశాంత చౌదరి సహా పలువురు బీజేపీ నేతలు జిల్లా మెజిస్ట్రేట్ శైలేష్ కుమార్ యాదవ్ ను సస్పెండ్ చేయాలని త్రిపుర ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ కు లేఖ రాశారు. పశ్చిమ త్రిపుర జిల్లాకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతిమా భౌమిక్ వధువు కుటుంబంతో వ్యక్తిగతంగా మాట్లాడుతానని తెలిపారు. 

Leave a Comment