సీఎం జగన్ మాట మార్చి..మోసం చేశాడు –  పవన్ కళ్యాణ్

రాజధాని రైతులకు అండగా నిలబడాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. సుమారు మూడు గంటలకు పైగానే జరిగిన సమావేశంలో మూడు రాజధానులతో పాటు పలు విషయాలపై నిశితంగా చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీడీపీ, వైసీపీలు రాజధాని రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని జనసేన నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఈ సమావేశంలో న్యాయపరంగా కూడా అమరావతికి మద్దతుగా పోరాడాలని తీర్మానించారు. టీడీపీ ప్రభుత్వంలో చేసిన తప్పులను ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ కూడా స్వార్ధానికి ఉపయోగించుకుంటోందని పవన్ చెప్పుకొచ్చారు. రైతుల కన్నీరు పెట్టకుండా భూములు తీసుకోవాలని నాడు చెప్పామన్న విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి జనసేనాని నిర్ణయించారు. మూడు రాజధానులనే నిర్ణయం సరైంది కాదని జనసేన స్పష్టం చేసింది. 

గతంలోనే  మరో ప్రభుత్వం వచ్చినా రైతులకు అన్యాయం జరగకుండా చట్టం ఉండాలని జనసేన సూచించిందని పవన్ తెలిపారు. ఆనాడు తమ పార్టీ మాటలను ఎవరూ పట్టించుకోలేదని నేడు జరుగుతున్న పరిణామాలకు టీడీపీనే బాధ్యత వహించాలని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణాలను పూర్తి చేయకుండా మధ్య లోనే ఆపివేయడం టీడీపీ చేసిన అతి పెద్ద తప్పని పవన్ చెప్పుకొచ్చారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు.

అమరావతిలో ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటానని ఎన్నికలప్పుడు చెప్పిన జగన్ రెడ్డి.. ఇప్పుడు మాట మార్చి మోసం చేశారని పవన్ మండిపడ్డారు. టీడీపీ, వైసీపీ రాజకీయాలకు రాజధాని రైతులను బలి చేయవద్దని ఈ సందర్భంగా సూచించారు. రైతులు 33వేల ఎకరాల భూములను ప్రభుత్వానికే ఇచ్చారన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు జనసేన అండగా ఉంటుందని సమావేశంలో నిర్ణయించామని ప్రకటనలో పవన్ చెప్పుకొచ్చారు. కాగా.. ఇప్పటికే రాజధాని అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశమని బీజేపీ తేల్చిచెప్పిన విషయం విదితమే.

 

Leave a Comment