‘దేవుడికి కూడా ఆధార్ కావాలంటే’ ఏం చేయాలి?

దేవుడికి కూడా ఆధార్ కార్డు కావాలంటే.. ఏం చేయాలి.. ఎక్కడికి వెళ్లాలి.. ప్రస్తుతం ఈ సమస్య ఓ పూజారికి వచ్చిపడింది. ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్ బండాలోని అత్తారా తహసీల్ లోని కూర్హారా గ్రామానికి చెందిన మహంత్ రామ్ కుమార్ దాస్ స్థానిక సీతారామచంద్ర ఆలయంలో ప్రధాన పూజారి..

ఆలయ బాగోగులు అన్ని దాస్ చూసుకునేవాడు. ఆలయానికి సంబంధించిన భూమిలో గోధుమ పంట వేశాడు. పంట 100 క్వింటాళ్లకు పైనే పండింది. రెండు రోజుల క్రితం దాస్ తమ పంటను అమ్మడానికి ఆన్ లైన్ లో రిజిస్టర్ చేశాడు. పంట తీసుకుని ప్రభుత్వ మార్కెట్ యార్డుకు వెళ్లాడు. 

అయితే అక్కడ అధికారులు పెట్టిన షరతుకు పూజారి దిమ్మదిరిగింది. పంట కొనాలంటే భూమి ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉందో వారి ఆధార్ కార్డు తీసుకురావాలని చెప్పారు. అంతే ఆ పూజారి దాస్ షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ భూమి దేవుడి పేరు మీద అంటే జానకిరాముల పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. ఆ సీతారాముల ఆధార్ కార్డు ఎలా తీసుకురావాలని ప్రశ్నించగా.. నిబంధనల ప్రకారం తాము ఆ పంట కొనలేమని తేల్చి చెప్పారు. 

 

Leave a Comment