ఏపీలో ఆగస్టు 1 నుంచి పర్యాటక ప్రాంతాల్లోకి సందర్శకులకు అనుమతి..!

 కేంద్ర ప్రభుత్వ కొవిడ్-19 నిబంధనలను పాటిస్తూ ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను తెరిచి… వాటిలోకి సందర్శకులను, పర్యాటకులకు అనుమతిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్యంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్) తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో రాష్ట్రంలో 5, 7 స్టార్ హోటళ్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా అల్లూరి సీతారామరాజు పేరుతో జిల్లా ఏర్పాటు చేయనున్నామని మంత్రి తెలిపారు. సచివాలయంలోని తన కార్యాలయంలో టూరిజం, శిల్పారామం, సాంస్కృతిక విభాగాలపై ఆయా శాఖాధిరులతో మంగళవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. 

అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనలనను అనుసరించి గత మార్చి నెల నుంచి రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను మూసివేశామన్నారు. నెలకు రూ.10 కోట్ల చొప్పున్న నేటి వరకూ రూ.60 కోట్ల మేర నష్టం వాటిల్లిందని మంత్రి తెలిపారు. లాక్ డౌన్ నిబంధలకనుగుణంగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను తెరవనున్నామని ఆయన తెలిపారు. 

 7 చోట్ల 5 స్టార్, 7 స్టార్ హోటళ్ల ఏర్పాటు…

రాష్ట్రంలో ఏడు పర్యాటక ప్రాంతాల్లో 5 స్టార్, 7 స్టార్ హోటళ్లు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ఈ హోటళ్లు ఏర్పాటుకు ప్రణాళిలు సిద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. ఇందుకోసం మరో వారం రోజుల్లో 13 జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

అల్లూరి సీతారామరాజు పేరిట జిల్లా ఏర్పాటు….

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. విశాఖ జిల్లాలో ఏర్పడే కొత్ల జిల్లాకు స్వాతంత్య్ర సమర యోధుడు, మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు. 

 

Leave a Comment