ప్రజామోదం మేరకే విశాఖ ఎంపిక  : విజయసాయిరెడ్డి

విశాఖ: ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిని కాంగ్రెస్‌, టీడీపీలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎక్కడా వెనకడుగు వేయకుండా ప్రజల అండతో పార్టీని ముందుకు నడిపిస్తున్నారని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విశాఖ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి అవంతి శ్రీనివాస్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఎన్నో పథకాలు అమలు చేసిందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ అన్ని వర్గాల ప్రజలను విజయపథం వైపు నడిపిస్తున్నారన్నారు. విశాఖలో 1.25 లక్షల ఇళ్ల స్థలాలను ప్రజలకు ఇచ్చేందుకు అధికారులు సిద్ధం చేసి ఉంచారని చెప్పారు.

కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ ఎంపికను ప్రజా ఆమోదం మేరకే తీసుకున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ప్రజోపయోగ  కార్యక్రమాలు చేపట్టిందని, జీవీఎంసీ ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలపై జరిగిన దాడి ఘటనపై విజయసాయిరెడ్డి స్పందించారు. టీడీపీ  నాయకులు ప్రజలను రెచ్చగొట్టడానికి వెళ్లడం వల్లే మాచర్ల ఘటన జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం మంత్రి అవంతి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలన్నదే తమ పార్టీ లక్ష్యమన్నారు. దీనిలో భాగంగానే బడుగు వర్గాలకు చెందిన ఇద్దరు నేతల్ని రాజ్యసభకు పంపించారని చెప్పారు. టీడీపీ  నేత వర్ల రామయ్యకు గెలిచే సమయంలో రాజ్యసభ టికెట్‌ ఇవ్వకుండా.. ఓడిపోయే సమయంలో చంద్రబాబు టికెట్‌ ఇచ్చారని మంత్రి వ్యాఖ్యానించారు.

 

Leave a Comment