కోహ్లీ కూతురుకు అత్యాచార బెదిరింపు.. ఆ పని చేసినందుకేనా..?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూతురు వామికకు అత్యాచార బెదిరింపులు రావడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.. ఈ ఓటమికి టీమిండియా పేసర్ మహ్మద్ షమీ కారణమంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది. మహ్మద్ షమీకి పాకిస్తాన్ వెళ్లిపోవాలంటూ ట్రోల్ చేశారు. అంతేకాకుండా షమీ కుటుంబ సభ్యులను సైతం పలువురు వేధించారు. ఈ విషయంలో పలువురు మాజీ క్రికెటర్లు, రాజకీయ నాయకులు షమీకి సపోర్ట్ గా నిలిచారు. ముస్లిం అని వేరు చేసి కులాలు, మతాలు కలిపి దూషించడం నీచమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా షమీకి అండగా నిలిచాడు. షమీపై జరుగుతున్న ట్రోలింగ్ ను ఖండించాడు. జట్టులో ఆటగాళ్లందరూ షమీకి అండగా ఉన్నారని, ఓ వ్యక్తిని మతం ఆధారంగా టార్గెట్ చేయడం నీచమైన పని అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఉందని, కానీ మతం ఆధారంగా వివక్ష చూపడం వ్యక్తిగతంగా ఇష్టపడనని కోహ్లీ తెలిపాడు. షమీ ఇండియాకు ఎన్ని మ్యాచ్ లను గెలిపించాడో ట్రోలర్స్ కు తెలియదని అన్నాడు.

విరాట్ కోహ్లీ షమీకి అండగా నిలబడటాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏకంగా కోహ్లీ, అనుష్క శర్మల గారాలపట్టి వామికను టార్గెట్ చేస్తున్నారు. 10 నెలల చిన్నారిపై అత్యాచారం చేస్తామంటూ గుర్తి తెలియని దుండగులు హెచ్చరించారు. @Criccrazygirl అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ బెదిరింపు మెసేజ్ వచ్చినట్లు గుర్తించారు. అయితే కాసేపటికే ట్వీట్ ను డిలీట్ చేశారు. 

కోహ్లీ కూతురుపై వచ్చిన ఈ బెదిరింపుపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ సహా పలువురు స్పందించారు. కోహ్లీని, అతడి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వచ్చిన బెదిరింపును ఆయన ఖండించారు. క్రికెట్ ఒక ఆట మాత్రమేనన్న విషయాన్ని ప్రజలు ముందు అర్థం చేసుకోవాలని అన్నాడు. మేమందరం వేర్వేరు దేశాల తరఫున ఆడుతున్నా ఆటగాళ్లు అందరూ ఒక్కటే అన్నారు. విమర్శిస్తే విరాట్ ఆటను విమర్శించాలి కానీ, వారి కటుంబ సభ్యులను విమర్శించే హక్కు ఎవరికీ లేదన్నారు. అయితే ఈ బెదిరింపుపై కోహ్లీ కానీ, అనుష్క శర్మ కానీ స్పందించలేదు. 

   

 

Leave a Comment