సైనిక లాంఛనాలతో వీర జవాన్ జశ్వంత్ రెడ్డి అంత్యక్రియలు..!

జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్ర మూకలతో జరిగిన ఎదురుకాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్ జశ్వంత్ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. స్వగ్రామం గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాదకొత్తపాలెంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోం మంత్రి సురచిత, డిప్యూటీ స్పీకర్ కూన రఘుపతి హాజరై నివాళులర్పించారు. సీఎం జగన్ ప్రకటించిన రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. 

జశ్వంత్ రెడ్డిని కడసారి చేసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆశ్రునయనాల మధ్య జశ్వంత్ కు వీడ్కోలు పలికారు. జై జవాన్ అంటూ నినాదాలు చేశారు. జమ్మూకశ్మీర్ లోని రాజౌరి జిల్లా సుందర్ బాని సెక్టార్ లో గురువారం సాయంత్రం జరిగిన ఉగ్రపోరులో జవాన్ జశ్వంత్ రెడ్డి అమరుడయ్యాడు. ఉగ్రవాదుల కాల్పుల్లో మొత్తం ఇద్దరు సైనికులు మరణించగా వారిలో జశ్వంత్ రెడ్డి ఒకరు. జశ్వంత్ రెడ్డి పార్థివదేహాన్ని శుక్రవారం ప్రత్యేక విమానంలో హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అనంతరం స్వగ్రామానికి తరలించారు. జశ్వంత్ రెడ్డికి తండ్రి శ్రీనివాసరెడ్డి, తల్లి వెంకటేశ్వరమ్మతో పాటు యశ్వంత్ రెడ్డి, విశ్వంత్ రెడ్డి అనే ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు.  

 

Leave a Comment