సెల్యూట్ సర్.. భిక్షాటన చేసుకునే పిల్లలకు ఎస్ఐ పాఠాలు..!

రోడ్డుపై భిక్షాటన చేసే వారి పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చదువు పట్ల అవగాహన లేక తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నప్పటి నుంచే యాచకులుగా మారుస్తున్నారు.. మరికొంత మంది ఇతర పనులకు పంపుతుంటారు.. అయితే వారిని ఆదుకోవాలని ఎవరూ కూడా ఆలోచించరు.. కానీ ఓ పోలీస్ అధికారి మాత్రం ఇలాంటి పిల్లలకు తన వంతు సాయం అందించాలని భావించారు.. 

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యకు చెందిన పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ రంజిత్ యాదవ్ భిక్షాటన చేసి అణగారిన కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. నిరుపేద విద్యార్థుల కోసం ఆయన ఏకంగా సొంతంగా పాఠశాల ప్రారంభించారు. బహిరంగ ప్రదేశంలో.. ఓ చెట్టు నీడలో తరగతులు నిర్వహిస్తున్నారు. అంతేకాదు.. సెలవు దొరికినప్పుడల్లా పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. ఈ పాఠశాలకు 50 మందికిపైగా విద్యార్థులు హాజరవుతున్నారు. వారికి అవసరమైన సామగ్రి, పుస్తకాలను ఉచితంగా అందిస్తున్నారు. 

తాను నివాసముండే ఏరియాలో కొన్ని కుటుంబాలకు చెందిన పిల్లలు బిచ్చమెత్తుకుంటూ కనిపించగా వారికి చదువు చెప్పించి మార్పు తీసుకురావాలనే ఆలోచన వచ్చినట్లు ఎస్ఐ రంజిత్ యాదవ్ తెలిపారు. ఆ తర్వాత వారి తల్లిదండ్రులతో మాట్లాడనని, వారు పిల్లలను చదివించేందుకు ముందుకొచ్చారని చెప్పారు. కొద్ది నెలల క్రితమే తరగతులు ప్రారంభించినట్లు తెలిపారు. పిల్లలు కూడా ఆయన చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటున్నారు.. 

 

Leave a Comment