సిటీ స్కాన్ కోసం వెళ్తే.. ఓ చిన్నారి ప్రాణం పోయింది..!

సిటీ స్కాన్ కోసం వెళ్తే ఓ చిన్నారి ప్రాణమే పోయింది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ధనౌలి ప్రాంతానికి చెందిన దివ్యాంశ్(3) ఇంటి మేడపై ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. దీంతో దివ్యాంశ్ తండ్రి వినోద్ వెంటనే చిన్నారిని స్థానిక నామ్నిర్ ఎన్ఆర్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు సిటీ స్కాన్ చేయాలని సూచించారు. 

ఈక్రమంలో చిన్నారి తల్లిదండ్రులు దివ్యాంశ్ ని సుభాష్ పార్క్ ప్రాంతంలో ఉన్న అగర్వాల్ సిటీ స్కాన్ సింటర్ కి తీసుకెళ్లారు. అక్కడ సిబ్బంది దివ్యాంశ్ కి ఓ ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత స్కానింగ్ చేశారు. అప్పటివరకు నవ్వుతూ ఉన్న దివ్యాంశ్.. స్కాన్ చేసిన తర్వాత ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోయాడు. 

వెంటనే దివ్యాంశ్ ని ఆస్పత్రికి తరలించగా.. చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. సిటీ స్కాన్ సెంటర్ లో తప్పిదం వల్లే దివ్యాంశ్ చనిపోయాడన్న అనుమానంతో.. చిన్నారి మృతదేశంతో స్కానింగ్ సెంటర్ వద్దకు వెళ్లారు. అయితే స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు అప్పటికే తాళం వేసి పరారయ్యారు. చిన్నారి కుటుంబ సభ్యులు మాత్రం స్కానింగ్ సెంటర్ బయట కూర్చొని ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి.. అగర్వాల్ సిటీ స్కాన్ సెంటర్ నిర్వాహకులు, సిబ్బందిపై కేసు నమోదు చేశారు. 

Leave a Comment