కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూత..!

కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) అధినేత రాం విలాస్ పాశ్వాన్(74) కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యం పాలైన ఆయనకు ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఆయన ఆరోగ్యం విషమించింది. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌  తన తండ్రి చనిపోయినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం రామ్ విలాస్ పాశ్వాన్ వినియోగదారుల వ్యవహరాల, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిగా ఉన్నారు. పాశ్వాన్‌ హఠాత్మరణంపై పార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన మృతిచెందడం ఎల్‌జేపీకి తీరని లోటుగా నేతలు భావిస్తున్నారు. 

పాశ్వాన్‌ ప్రస్తుత వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిగా ఉన్నారు. 2010 నుండి 2014 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్న తరువాత 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో హాజీపూర్ నియోజకవర్గం నుండి 16వ లోక్‌సభ తిరిగి ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా కొనసాగున్నారు. మొత్తం ఎనిమిది సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1946 జూలై 5న బిహార్‌లో జన్మించిన పాశ్వాన్‌..  2000లో లోక్‌ జనశక్తి పార్టీని స్థాపించారు. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో భాగంగా కేంద్రమంత్రి పదవిలో కొనసాగుతున్నారు.

మంచి మిత్రుడిని కోల్పోయాను – మోడీ

రామ్ విలాస్ పాశ్వాన్ మృతి పట్ల ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాశ్వన్ మృతితో ఒక మంచి మిత్రుడిని కోల్పోయానన్నారు. పేదల కోసం అహర్నిహలు శ్రమించారన్నారు. ఆయన లేని లోటును ఎవరూ పూడ్చలేరన్నారు. ఆయన మరణం తనకు వ్యక్తిగతంగానూ లోటుగా అనిపిస్తుందన్నారు.  

సీఎం జగన్ సంతాపం

కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మృతి పట్ల ఏపీ సీఎం జగన్ సంతాపం తెలిపారు. ఐదు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో ఉన్న దళిత నాయకుడు, ఎల్జేపీ చీఫ్ అణగారిన వర్గాలవారిపట్ల గొంతుకగా నిలిచారన్నారు. ఆయన మృతి దేశ రాజకీయాలలో తీరని లోటుగా మిగిలిపోనుందన్నారు.

కేసీఆర్ దిగ్భ్రాంతి..

కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన అండగా నిలిచారన్నారు. రాజకీయ నాయకుడిగా సామాజిక ఉద్యమ కారుడిగా పాశ్వాన్ కు భారత రాజకీయ చరిత్రలో గొప్ప స్థానం ఉందని తెలిపారు.  

 

Leave a Comment