పెద్ద నోట్ల రద్దు వల్లే నిరుద్యోగం పెరిగింది : మన్మోహన్ సింగ్

భారత దేశంలో నిరుద్యోగం పెరగడానికి పెద్ద నోట్ల రద్దే కారణమని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు నిరుద్యోగం పెరిగేందుకు కారణమవుతున్నాయని విమర్శించారు. చిన్న, మధ్య తరగతి పేదలపై తీవ్ర ప్రభావం పడుతోందని, వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇష్టారీతిన తీసుకున్న నిర్ణయాల్లో పెద్ద నోట్ల రద్దు కూడా ఒకటని చెప్పుకొచ్చారు. కేరళలోని రాజీవ్ గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డెవలప్ మెంట్ స్టడీస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు. ‘ప్రతీక్ష 2030’ పేరుతో నిర్వహించిన డెవలప్ మెంట్ సదస్సులో వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు అనాలోచిత చర్యగా అభివర్ణించారు. 

రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపకుండా  ఏకపక్షంగా పెద్ద నోట్ల రద్దు చేశారని విమర్శించారు. ఆర్బీఐతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో మరింత సంక్షోభంలోకి నెట్టేస్తాయని హెచ్చరించారు. చిన్న, మధ్య తరహా రంగాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని తెలిపారు. 

నిరుద్యోగం పెరగడం వెనుక పెద్ద నోట్ల రద్దు అంశం కూడా ఉందని చెప్పుకొచ్చారు. అసంఘటిత రంగం చాలా దెబ్బతిన్నదని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో నిధుల పరిస్థితి గందరగోళంగా మారిందన్నారు. పాలన కొనసాగించేందుకు భారీగా అప్పులు తీసుకొచ్చే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. దీంతో భవిష్యత్తులో రాష్ట్రాలు కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందన్నారు.  

Leave a Comment