బబుల్ గమ్ తో.. కోవిడ్ వ్యాప్తికి చెక్..!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వణికిస్తోంది. కరోనా వైరస్ ని అరికట్టేందుకు శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ప్రత్యేక చూయింగ్ గమ్ ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రత్యేకంగా వృద్ధి చేసిన మొక్కల ఆధారిత ప్రోటీన్ పొరతో దీనిని రూపొందిస్తున్నారు. ఈ చూయింగ్ గమ్ ఆధారంగా లాలాజలంలో ఉండే వైరస్ లోడ్ ను తగ్గించి వైరస్ వ్యాప్తికి కళ్లెం వేసే ప్రయత్నం చేస్తున్నారు.

సార్స్-కోవ్-2 లాలాజల గ్రంథుల్లో రెట్టింపు అవుతుంది. దీంతో కరోనా సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా, లేదా మాట్లాడినప్పుడు వైరస్ బయటకు వచ్చి ఇతరులకు సంక్రమిస్తుంది. ఈ అంశంపై హెన్నీ డేనియల్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు పరిశోధన సాగించారు. ఇందు కోసం ఆయన సొంత ల్యాబ్ లో ప్రత్యేక ప్రోటీన్ ను వృద్ధి చేశారు. వీటితో పాటు ప్రోటీన్ ఆధారిత చూయింగ్ గమ్ ను ఉపయోగించి దంతాలపై ఏర్పడే పూత నివారణపై జరిపిన పరిశోధనలోనూ పాల్గొన్నారు. 

ప్రోటీన్ ఆధారంగా డానియల్ చేసిన ప్రయత్నాలు మెరుగైన ఫలితాలు ఇచ్చాయి. దీని ద్వారా లాలాజలంలో కరోనా వైరస్ ను తగ్గించవచ్చా అనే దానిని పరిశీలించారు. మొక్కల్లో వృద్ధి  చేసిన ఏస్2 గ్రాహకాలను చూయింగ్ గమ్ పూతగా వాడారు. వాటిని కరోనా సోకిన వ్యక్తులతో పాటు ఇతరులకు ఇచ్చి వారి నోటి నుంచి నమూనాలను సేకరించి పరీక్షించారు. దీని ద్వారా ఏస్2 గ్రాహకాలు కరోనాకు కారణమైన వైరస్ ని తటస్థీకరిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఏస్2 గ్రాహకాలు వైరస్ ని అడ్డుకుంటున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ప్రాథమిక పరిశోధనలు ప్రారంభించారు. వీటిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడైంది.     

 

 

 

Leave a Comment