గుంజీలు తీయించి.. నేలపై ఉమ్మి నాకించి.. దళితులపై దాష్టికం..!

పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు నిరాకరించినందుకు ఇద్దరు దళిత యువకుల పట్ల దాష్టికానికి పాల్పడ్డారు. వారితో గుంజీలు తీయించారు. నేలపై ఉమ్మిని వారితో నాకించారు. ఈ అమానవీయ ఘటన బీహార్ లోని సింఘ్న గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

బీహార్ లో రెండురోజుల క్రితం పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరిగింది. మహా దళిత్ సామాజిక వర్గానికి చెందిన అనిల్ కుమార్, మంజీత్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు ఓటు వేయడానికి వెళ్లారు. బలవంత్ సింగ్ అనే వ్యక్తి వీరిని అడ్డుకుని తనకు ఓటు వేయాలని కోరాడు. అయితే వీరిద్దరు బలవంత్ సింగ్ కి ఓటు వేసేందుకు నిరాకరించారు. 

దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన బలవంత్ సింగ్ ఇద్దరిని దూషిస్తూ వారితో గుంజీలు తీయించాడు. అంతటితో ఆగకుండా నేలపై ఉమ్మి వేసి దానిని ఆ ఇద్దరితో నాకించాడు. దీనిని అక్కడ ఉన్న వారు వీడియో తీసి వైరల్ చేశారు. దీంతో స్థానిక పోలీసులు బలవంత్ సింగ్ ని అరెస్ట్ చేశారు. బాధిత వ్యక్తులు బలవంత్ సింగ్ పై ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

 

Leave a Comment